ఆస్ట్రేలియా ప్రధాని రాక వాయిదా

5 Jan, 2020 03:07 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో ఆ దేశ ప్రధాని స్కాట్‌ మారిసన్‌ భారత్‌ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్యటనను వాయిదా వేస్తున్నామని, రానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని ట్వీట్‌ చేశారు. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్‌ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

తన పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చేసినందుకు ఇరు దేశాల ప్రభుత్వాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు భారీగా ఆస్తులను దహనం చేస్తోంది. ఈ విపత్తు సమయంలో తాను దేశంలో ఉండి పౌరులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని మారిసన్‌ పేర్కొన్నారు. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ శుక్రవారం మారిసన్‌తో మాట్లాడారు. భారతీయుల తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతిచెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్‌ బలగాలను రంగంలోకి దించింది. 

మరిన్ని వార్తలు