అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం: ఇరాన్‌

22 Jul, 2020 09:46 IST|Sakshi

ఇరాన్‌ సుప్రీంలీడర్‌ ఖమేనీ వ్యాఖ్యలు

టెహ్రాన్‌: ఇరాన్‌ ఖుడ్స్‌ ఫోర్స్‌ అధిపతి ఖాసీం సులేమాని హత్యకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఆ దేశ సుప్రీం లీడర్‌ అయాతుల్లా అలీ ఖమేనీ పునరుద్ఘాటించారు. ఖాసీంను హతమార్చినందుకు అమెరికాను దెబ్బకొట్టి తీరతామని స్పష్టం చేశారు. ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌- కధిమితో మంగళవారం జరిగిన భేటీలో ఖమేనీ ఈ మేరకు వ్యాఖ్యలు చేసినట్లు ఆయన అధికారిక వెబ్‌సైట్‌ వెల్లడించింది. కాగా ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు.. ఇరాక్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయంపై దాడి చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రతీకారంగా అగ్రరాజ్యం.. జనవరి 3న ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో రాకెట్‌ దాడికి పాల్పడి.. ఇరాన్‌ జనరల్‌ సులేమానిని హతమార్చింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారస్థాయికి చేరుకోవడంతో పరస్పరం ప్రతీకార దాడులకు దిగాయి. (ట్రంప్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిన ఇరాన్‌)

ఈ క్రమంలోనే ఇరాన్‌లో ఉక్రెయిన్‌ విమానం కూలిపోగా 176 మంది మృత్యువాత పడ్డారు. తొలుత ఈ ఘటనతో తమకు సంబంధం లేదన్న ఇరాన్‌.. ఆ తర్వాత మానవ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, తమను క్షమించాల్సిందిగా బాధితుల కుటుంబాలను అభ్యర్థించింది. అదే విధంగా సులేమానిని హతమార్చిన అమెరికా, అందుకు సహకరించిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సులేమాని గురించి అమెరికాకు సమాచారమిచ్చిన తమ పౌరుడిని ఉరి తీసేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఇరాన్‌ న్యాయ శాఖ గత నెలలో ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా... అమెరికా- చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ ఇరాన్‌ డ్రాగన్‌తో దౌత్య సంబంధాలు మెరుగుపరచుకుంటూ భారీ ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. అదే విధంగా ఇరాక్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించే దిశగా ప్రధానితో ఖమేనీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.(అమెరికాకు ఇరాన్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు