ఆ లోపంతోనే మతిమరుపు!

28 Jul, 2016 20:23 IST|Sakshi
ఆ లోపంతోనే మతిమరుపు!

ఫ్లోరిడాః వృద్ధాప్యంలో మతిమరువు రావడానికి విటమిన్ బి-12 తక్కువ స్థాయిలో ఉండటమే కారణం కావచ్చని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. వయసు పెరగడం వల్ల జీర్ణాశయంలో ఆమ్లాలు విడుదలయ్యే స్థాయి తగ్గిపోవడంతో  ఆహారంలోని బి-12 ను గ్రహించే శక్తి శరీరం కోల్పోతుందని, దీంతో  క్రమ క్రమంగా వృద్ధుల్లో విటమిన్ లోపానికి దారితీస్తుందని ఫ్లోరిడాకు చెందిన సైంటిస్టులు పరిశోధనలద్వారా కనుగొన్నారు.

వయసు పైబడినవారిలో మతిమరుపు రావడానికి ముఖ్య కారణం విటమిన్ బి-12 లోపం కావచ్చని నోవా ఆగ్నేయ యూనివర్శిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్.. రిచర్డ్ డెట్ మెదడుపై నిర్వహించిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ లోపంతో బాధపడేవారిలో సమస్య బయటకు పెద్దగా కనిపించకపోయినా... క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో చెప్పిన విషయాలను మరచి పోవడం, మళ్ళీ మళ్ళీ అడుగుతుండటమే కాక, ప్రతి విషయానికీ తిగమక పడటం వంటి లక్షణాలు వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తాయని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మనిషి శరీరంలోని నాడీ వ్యవస్థ పనిచేయడానికి బి-12 విటమిన్ ఎంతగానో సహకరిస్తుంది. అందుకే విటమిన్ లోపం ఏర్పడగానే శరీరంలో నిస్సత్తువ, అవయవాలు పట్టుతప్పి, మూత్రం తెలియకుండా వచ్చేయడం, బీపీ తగ్గడంతో పాటు మతిమరుపు వంటి అనేక సమస్యలు మెల్లమెల్లగా బయట పడతాయని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయంలో సమస్యను గుర్తించకపోతే అది.. రక్త హీనతకు కూడా దారి తీసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు.

వయసులో ఉన్నపుడు మనశరీరం కణజాలంలోనూ, కాలేయాల్లోనూ బి-12 ను నిల్వ చేసుకుంటుందని, అందుకే ఆ సమయంలో విటమిన్ తగినంత శరీరానికి అందకపోయినా పెద్దగా తేడా కనిపించదని చెప్తున్నారు. అయితే ఉండాల్సిన కన్నా భారీ స్థాయిలో లోపం ఏర్పడితే మాత్రం శరీరంలో సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందంటున్నారు. బి-12 లోపం నివారించాలంటే ఆ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలైన
చేపలు, మాంసం, కాలేయం వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.  చికెన్, గుడ్లు, పాలు, పాల పదార్థాల్లో కూడా బి-12 ఉన్నా.. తక్కువ మోతాదులో ఉంటుందని, శాకాహారంలో అయితే బి-12 పెద్దగా కనిపించదని పరిశోధకలు చెప్తున్నారు. అందుకే శాకాహారులు..  బి-12 లోపం కనిపిస్తే వైద్యుల సలహా మేరకు విటమిన్ మాత్రలు వాడాల్సి ఉంటుందని సూచిస్తున్న పరిశోధకులు.. తమ అధ్యయనాలను  ప్లాస్ వన్ జర్నల్ లో నివేదించారు.

మరిన్ని వార్తలు