రైలులో పుట్టాడు.. బంపర్‌ ఆఫర్ కొట్టాడు‌..!

18 Jun, 2018 20:21 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పారిస్‌ : రైలులో జన్మించిన ఓ శిశువుకు ఫ్రెంచ్‌ రైల్వే శాఖ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అతడికి 25 ఏళ్లు వచ్చేవరకు రైలులో ఉచితంగా ప్రయాణించే వీలు కల్పించింది. అసలేం జరిగిందంటే... సోమవారం రైలులో ప్రయాణిస్తున్న మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసవించింది. ఊహించని పరిణామానికి కంగుతిన్న రైల్వే సిబ్బంది.. సెంట్రల్‌ ప్యారిస్‌లోని ఔబర్‌ స్టేషన్‌లో రైలును ఆపి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో.. బిజీగా ఉండే సెంట్రల్‌ ప్యారిస్‌ రైల్వే మార్గంలో 45 నిమిషాల పాటు రైళ్లు  నిలిచిపోయాయని రైల్వే అధికారి తెలిపారు.

అయితే ప్రసవ సమయంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో 15 మంది రైల్వే సిబ్బంది ఆ మహిళకు సాయంగా నిలిచి మానవత్వం చాటుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని... రైలులో జన్మించిన ఈ బుడతడికి తమ వంతు కానుకగా 25 ఏళ్ల పాటు రైలులో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నామని ఆర్టీఏపీ (ప్యారిస్‌ ప్రజా రవాణా వ్యవస్థ) ప్రకటించింది.

మరిన్ని వార్తలు