బాగ్దాదీని ఎలా గుర్తించారంటే..?

29 Oct, 2019 21:13 IST|Sakshi

బీరట్‌: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐసిస్‌) చీఫ్‌ అబు బాకర్‌-అల్‌- బాగ్దాదీని హతమార్చేందుకు అమెరికా పక్కా వ్యూహంతో పనిచేసింది. అబు బాకర్‌ను మట్టుబెట్టడానికి ముందు కుర్దీష్‌ నేతృత్వంలోని సిరియా డెమొక్రటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌) సహాయంతో డీఎన్‌ఏ పరీక్ష ద్వారా అతడే అని నిర్ధారించుకుంది. రహస్య వర్గాల ద్వారా అబు బాకర్ లోదుస్తులను సేకరించి డీఎన్‌ఏ పరీక్ష చేయించినట్టు ఎస్‌డీఎఫ్‌ సీనియర్‌ సలహాదారు పొలట్‌ కాన్‌ ట్విటర్‌లో వెల్లడించారు. అబు బాకర్‌ ఆచూకీ తెలపడంతో ఎస్‌డీఎఫ్‌ ఏవిధంగా సహాయపడిందో ఆయన వివరించారు.

‘ఎస్‌డీఎఫ్‌ రహస్య బృందాలు అబు బాకర్‌ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అక్కడికి వెళ్లాయి. అతడి లోదుస్తులను తీసుకొచ్చి డీఎన్‌ఏ పరీక్ష చేయించాం. వంద శాతం అతడే అని ధ్రువీకరించుకున్నాకే ఆ సమాచారాన్ని అమెరికా దళాలకు చేరవేశాం. చివరివరకు సమర్థవంతంగా పనిచేసి ఆపరేషన్‌ విజయవంతం కావడంలో కీలకంగా వ్యవహరించామ’ని పొలట్‌ కాన్‌ వెల్లడించారు. ఎస్‌డీఎఫ్‌ ఇచ్చిన సమాచారం ‘ఆపరేషన్‌ కైలా ముల్లర్‌’లో ఎంతో ఉపయోగపడిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అబు బాకర్‌ను పట్టుకునేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో మే నెల 15 నుంచి పనిచేస్తున్నట్టు చెప్పారు. (చదవండి: ఐసిస్‌ చీఫ్‌ బాగ్దాదీ హతం)

మరిన్ని వార్తలు