బహ్రెయిన్‌లో తొలి ‘కరోనా’ మరణం

16 Mar, 2020 18:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మనామా: గల్ఫ్‌ దేశం బహ్రెయిన్‌లో సోమవారం తొలి కోవిడ్‌-19(కరోనా వైరస్‌) మరణం నమోదైంది. ఇరాన్‌ నుంచి వచ్చిన 65 ఏళ్ల మహిళ ప్రాణాంతక కరోనా వైరస్‌ కారణంగా మృతి చెందారని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. అయితే ఆమె ప్రయాణం తర్వాత ఎవరినీ నేరుగా కలవలేదని.. ఐసోలేషన్‌ వార్డులోనే ఉన్నారు కాబట్టి.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. అదే విధంగా ఇప్పటిదాకా దేశంలో 214 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. కరోనా అనుమానితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చింది.

ఈ క్రమంలో గల్ఫ్‌ దేశాల్లో తొలి కరోనా మృతిని నమోదు చేసిన దేశంగా బహ్రెయిన్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో... ‘‘ మనం అతికష్టమైన సవాలును ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా’’ అని బహ్రెయిన్‌ ఆరోగ్య శాఖా మంత్రి తాఫిక్‌ అల్‌ రాబియా సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు. దీంతో... ‘‘ మేమంతా ఇంట్లోనే ఉంటాం అందరి శ్రేయస్సు కోసం’’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో నెటిజన్లు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. (కరోనా అప్‌డేట్‌: 118కి చేరిన కేసుల సంఖ్య)

కాగా మహమ్మారి కరోనా వ్యాప్తి నేపథ్యంలో సౌదీ అరేబియా, కువైట్‌ దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలన్నింటిపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా జిమ్ములు, పబ్లిక్‌ పార్కులు, స్పాలు మూసివేస్తున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు దిగివస్తున్న వేళ తమ మార్కెట్‌కు అండగా నిలిచేందుకు అబుదాబి సోమవారం భారీగా నిధులు కేటాయించింది. క్యాపిటల్‌ మార్కెట్‌ లిక్విడిటీని పెంచేందుకు1 బిలియన్‌ దీరాంలు  విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఇక కరోనా కారణంగా నష్టపోతున్న చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకునేందుకు సౌదీ అరేబియా 50 బిలియన్‌ రియాల్‌ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఖతార్‌ సైతం కరోనాను ఎదుర్కొనేందుకు 20.5 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. 

మరిన్ని వార్తలు