అక్కడ నోరు విప్పితే జైలే

1 Jun, 2016 17:38 IST|Sakshi
అక్కడ నోరు విప్పితే జైలే

మనామా: పర్షియన్ గల్ఫ్ దేశమైన బహ్రెయిన్‌లో భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తోంది. ప్రభుత్వం పనితీరును విమర్శించినందుకు, దేశంలో సంస్కరణలు తీసుకరావాలని కోరినందుకు ప్రతిపక్ష నాయకుడు షేక్ అలీ సల్మాన్‌కు బహ్రెయిన్ కోర్టు ఆదివారం నాడు తొమ్మిదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధాన ప్రతిపక్షమైన అల్‌వెఫాక్ నేషనల్ ఇస్లామిక్ సొసైటీ జనరల్ సెక్రటరీ షేక్ అలీ సల్మాన్‌ను వాస్తవానికి గతేడాది జూన్ 15వ తేదీనే అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే ఆయనకు నాలుగే ళ్ల జైలు శిక్ష విధించింది. దీన్ని అప్పీళ్ల కోర్టుల్లో అప్పీల్ చేసిన పాపానికి ఆదివారం నాడు కోర్టు అంతకుముందు విధించిన నాలుగేళ్ల జైలు శిక్షను తొమ్మిదేళ్లకు పెంచుతూ తీర్పు చెప్పింది.
 

 2012, 2014లలో దేశ హోంశాఖను విమర్శించినందుకు, చట్టాన్ని ఉల్లంఘించాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించారనే ఆరోపణలపైనే కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పిన ఎంతో మంది ప్రతిపక్ష నాయకులను బహ్రెయిన్ రాజు హమెద్ బిన్ ఇసా అల్ ఖలీఫా జైల్లో పెట్టించారు. షియాలు ఎక్కువగావున్న ఈ దేశంలో రాజు సున్నీ తెగకు చెందిన వ్యక్తి. సైనిక, కోర్టు పదవుల్లో రాజు కుటుంబీకులే ఉన్నారు.

మరిన్ని వార్తలు