భారీ విస్ఫోటనం.. 450 విమానాలు రద్దు

29 Jun, 2018 16:29 IST|Sakshi

డెన్‌పసర్‌ (ఇండోనేసియా) :  ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవించే ఇండోనేసియా, బాలి తీరంలో మరోసారి కల్లోలం మొదలైంది. మౌంట్‌ అగంగ్‌ మరోసారి తన ప్రతాపం చూపించడంతో స్థానిక ప్రజలతో పాటు విదేశీ పర్యాటకులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం రోజు కూడా అగ్నిపర్వతం నుంచి లావా ఎగజిమ్ముతుండటంతో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేస్తున్నాయి. దాదాపు 2000 మీటర్ల (6500 అడుగుల) ఎత్తు వరకు దట్టమైన పొగలు వ్యాప్తి చెందడంతో అప్రమత్తమైన అధికారులు 450 విమాన సర్వీసులను రద్దు చేశారు. దాంతో పాటుగా ఎన్‌గురా రాయ్‌ విమనాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఒకానొక దశలో 23,000 అడుగుల ఎత్తులోనూ పొగల ప్రభావం ఉన్నట్లు గుర్తించారు. 

దట్టమైన పొగల కారణంగా విమాన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని భావించి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు బాలి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తామని,  ఆపై పరిస్థితులు అదుపులోకొస్తే సర్వీసులను పునరుద్ధరించనున్నారు. 450 సర్వీసులు రద్దు చేయడంతో 75,000 మంది విమాన ప్రయాణికులపై ఇది ప్రభావం చూపుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికీ అగ్నిపర్వతం పేలిపోయే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో మౌంట్‌ అగంగ్‌కు దాదాపు 4 కిలోమీటర్ల పరిధిలో ఎవరినీ భద్రతా సిబ్బంది అనుమతించడం లేదు.

గురువారం సాయంత్రం నుంచి సహాయక చర్యలు, భద్రతా చర్యలు చేపట్టామని బాలి గవర్నర్‌ మంగ్‌కు పస్టికా చెప్పారు. విదేశీ పర్యాటకులను మరో ప్రత్యామ్నాయం కోసం తమ సిబ్బంది కృషి చేస్తున్నారని తెలిపారు. ఆస్ట్రేలియా పర్యాటకుడు రాడ్‌ బర్డ్‌ మీడియాతో మాట్లాడుతూ.. పెర్త్‌కు వెళ్లే విమానం రెండోసారి రద్దయిందని శుక్రవారం ఉదయం అధికారులు చెప్పారంటూ వాపోయాడు. 

బాలి విస్ఫోటనాల్లో అతిపెద్దది 1963లో సంభవించింది. ఆ దుర్ఘటనలో 1100 మంది మృత్యువాత పడ్డారు. 70 కిలోమీటర్ల పరిధిలో విస్ఫోటనం ప్రభావం చూపించింది.


 

మరిన్ని వార్తలు