‘నిషేధం’పై వెనక్కి!

5 Feb, 2017 01:43 IST|Sakshi
‘నిషేధం’పై వెనక్కి!

ముస్లిం దేశాల వలసల నిషేధంపై
మెట్టుదిగిన ట్రంప్‌ సర్కారు

- పాత నిబంధనలే అనుసరిస్తామని ప్రకటన
- అంతకుముందు ట్రంప్‌ ఆదేశాలపై సియాటెల్‌ కోర్టు స్టే
- అధ్యక్షుడి నిర్ణయంతో కోలుకోలేని ఇబ్బందులన్న జడ్జి
- ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్‌ చేస్తామన్న శ్వేతసౌధం
- జడ్జిది పిచ్చి నిర్ణయమని ట్రంప్‌ మండిపాటు


వాషింగ్టన్‌: అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక దూకుడుగా ముందుకెళ్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఏడు ముస్లిం దేశాల నుంచి వలస వచ్చే వారిపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపేస్తున్నట్లు ట్రంప్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. వీసాల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన తలెత్తినా పట్టించుకోని ప్రభుత్వం.. శుక్రవారం అర్ధరాత్రి సియాటెల్‌ జిల్లా ఫెడరల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో తన ఆదేశాలను వెనక్కుతీసుకుంటున్నట్లు ప్రకటించింది.   దీంతో 60వేల వీసాలను పునరుద్ధరించినట్లు వెల్లడించింది. ‘వీసాల రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించాం’ అని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి వెల్లడించారు. సియాటెల్‌ కోర్టులో వాషింగ్టన్‌ అటార్నీ జనరల్‌ ఫెర్గూసన్‌ చేసిన ఫిర్యాదులోని న్యాయపరమైన సవాళ్లపై సమీక్ష జరుపుతున్నట్లు తెలిపారు.

జడ్జి ఆదేశాలపై ఉన్నత న్యాయ స్థానంలో అప్పీలు చేయాలని ట్రంప్‌ సర్కారు నిర్ణయించింది. ‘జడ్జి ఉత్తర్వుల ప్రకారం కార్యనిర్వాహక ఆదేశాల్లోని అంశాల అమలును తక్షణమే ఆపేస్తున్నాం. గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సోదాలు నిర్వహిస్తాం’ అని అమెరికా అంతర్గ భద్రత శాఖ మరో ప్రకటనలో తెలిపింది. అయితే, వీసాల రద్దు సరైనది, చట్టపరమైనదని.. జడ్జి ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్‌ చేసి తిరిగి వీసాల రద్దును అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తామని వెల్లడించింది. ‘దేశ శ్రేయస్సుకోసం అధ్యక్షుడు తీసుకొచ్చిన చట్టపరమైన కార్యనిర్వాహక ఆదేశాలను కొనసాగించేలా.. కోర్టు నిర్ణయంపై వీలైనంత త్వరగా స్టే కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తాం’ అని శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ సీన్‌ స్పైసర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ట్రంప్‌ నిర్ణయంతో ఇబ్బందులే: కోర్టు
అంతకుముందు, వాషింగ్టన్‌ అటార్నీ జనరల్‌ బాబ్‌ ఫెర్గూసన్‌ చేసిన ఫిర్యాదుపై శుక్రవారం అర్ధరాత్రి విచారణ జరిపిన సియాటెల్‌ ఫెడరల్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి జేమ్స్‌ రాబర్ట్‌.. వీసా రద్దుపై ట్రంప్‌ తీసుకొచ్చిన ఆదేశాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘అధ్యక్షుడి నిర్ణయం దేశ ప్రజలపై తీవ్రమైన వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది. ఉపాధి, విద్య, వ్యాపారం, కుటుంబ సంబంధాలు, స్వతంత్రత, పర్యాటకం వంటి రంగాల్లో ఇబ్బందులు తప్పవు. ఫిర్యాదుదారు (వాషింగ్టన్‌ అటార్నీ జనరల్‌ ఫెర్గూసన్‌) రాజ్యాంగం తనకిచ్చిన హక్కులను పొందాలనుకుంటున్నారు. ట్రంప్‌ నిర్ణయం వల్ల దేశ ప్రజలకు కోలుకోలేని ఇబ్బందులు తలెత్తవచ్చు’ అని తన ఆదేశాల్లో జడ్జి పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో నిరసనకారులతోపాటు ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. ‘ఇది రాజ్యాంగ విజయం. అధ్యక్షుడు సహా ఎవరూ చట్టానికన్నా గొప్పవారు కాదు’ అని ఫెర్గూసన్‌ వెల్లడించారు. కోర్టు నిర్ణయాన్ని భారత–అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యురాలు ప్రమీలా జైపాల్‌ స్వాగతించారు.