తొక్కేకదా అని తేలిగ్గా తీసేయకు....

23 Oct, 2015 08:18 IST|Sakshi
తొక్కేకదా అని తేలిగ్గా తీసేయకు....

కాలిఫోర్నియా: అరటి పండు తొక్కను తేలిగ్గా తీసుకొని పారేయకు. పండులోకన్నా తొక్కలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. తొక్కలో ఏ, బీ6,బీ12, సీ విటమిన్లతోపాటు మ్యాగ్నీషియమ్, పొటాషియమ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఉన్నాయని శాండియాగోకు చెందిన లారా ఫ్లోర్స్, ఎల్లా ఆల్‌రెడ్ అనే పోషక విలువల నిపుణులు తెలియజేస్తున్నారు.


ఏ విటమిన్ వల్ల పళ్లు, ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. పంటి చిగుళ్లు బలపడుతాయి. బీ6 విటమిన్ వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. బీ12 విటమిన్ మెదడుతోపాటు నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతోపాటు బరువును తగ్గిస్తుంది. సీ విటమిన్ శరీరంపై గాయాలు మానేందుకు ఉపయోగపడుతుంది. కొత్త కణజాలం, లిగమెంట్ల అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ బలపడడమే కాకుండా శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నిద్ర లేమిని దూరం చేసేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు పొటాషియం, మ్యాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి.


అరటి పండు తొక్కలో మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. భారత్ లాంటి దేశాల్లో  చర్మంపై దురదలు పోవడానికి, పులిపిర్లను నయం చేసేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు. దోమలు, ఇతర కీటకాలు కుట్టిన చోట తొక్కను ప్యాచ్‌లాగా వేస్తే చల్లదనానిచ్చి ఉపశమనం కలిగిస్తుంది. సిట్రిక్ యాసిడ్ కలిగిన నారింజ, నిమ్మ కాయల తొక్కల్లో కూడా పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి త్వరగా జీర్ణం కావు కనుక వాటిని ఆహారంగా తీసుకోలేమని నిపుణులు తెలియజేస్తున్నారు. అరటి పండు తొక్క త్వరగా జీర్ణమవుతుందని, నేరుగా తినలేనివాళ్లు ఉడకబెట్టుకొని, కొంచెం వేపుకొని కూడా తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు