బ్యాంకు నుంచి 540 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

15 Mar, 2016 19:48 IST|Sakshi
బ్యాంకు నుంచి 540 కోట్లు కొల్లగొట్టిన హ్యాకర్లు

బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్న అతిపెద్ద రాబరీ
సెంట్రల్ బ్యాంకు చీఫ్ రాజీనామా


చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు దోపిడీ బంగ్లాదేశ్‌ను కుదిపేస్తున్నది. సైబర్ నేరగాళ్లు హ్యాకింగ్ ద్వారా బంగ్లాదేశ్ సెంట్రల్‌ బ్యాంకు నుంచి రూ. 540 కోట్లు (40 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టడం దుమారం రేపుతున్నది. ఈ వ్యవహారంలో సెంట్రల్ బ్యాంకు గవర్నర్ అతివుర్ రహ్మాన్‌ తన పదవికి రాజీనామా చేసినట్టు బంగ్లాదేశ్ ఆర్థికమంత్రి మంగళవారం వెల్లడించారు. తన సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకొన్నట్టు చెప్పారు.

మానవ చరిత్రలోనే అతిపెద్ద సైబర్ రాబరీగా ఈ దొంగతనం నిలిచిపోయింది. దీంతో బంగ్లాదేశ్ వద్ద ఉన్న 27 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యానికి భద్రత ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దోపిడీ వ్యవహారం బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తమ అమెరికా ఖాతాలో బిలియన్ డాలర్ల (రూ. 6,740 కోట్ల)ను దోచుకోవడానికి హ్యాకర్లు ప్రయత్నించారని, అయితే డబ్బు ట్రాన్స్‌ఫర్ విజ్ఞప్తికి చివరినిమిషంలో రెడ్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఈ దోపిడీని చాలావరకు నిరోధించామని బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంకు చెప్తోంది.

అమెరికా రిజర్వు బ్యాంకు అయిన న్యూయార్క్ ఫెడ్‌లోని బంగ్లా ఖాతా నుంచి డబ్బు ఉపసంహరణకు హ్యాకర్లు 35 విజ్ఞప్తులు పంపడమే కాకుండా, బ్యాంకుల మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్‌ను వాడుకొని డబ్బు యావత్తును ఊడ్చిపారేసేందుకు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో అమెరికా రిజర్వు బ్యాంకు సిస్టం సరిగ్గా పనిచేయలేదని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, అది మాత్రం ఆరోపణలను తోసిపుచ్చుతోంది. హ్యాకర్ల నుంచి భారీగా సొమ్ము రికవరీ చేశామని, నేరగాళ్ల నుంచి దోపిడీకి గురైన మిగతా డబ్బు కూడా రాబట్టేందుకు ఫిలిపీన్ అధికారులతో కలిసి పనిచేస్తున్నామని బ్యాంకు అధికారులు చెప్తున్నారు.
 

మరిన్ని వార్తలు