సంచలనం సృష్టిస్తోన్న మదర్సా పూర్వ విద్యార్థి వ్యాఖ్యలు

29 Aug, 2019 18:34 IST|Sakshi

ఢాకా: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన మదర్సాలు కొన్ని వికృత కార్యాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. పసిమొగ్గలపై పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ అరాచాకాల గురించి నోరు విప్పితే.. ప్రాణాలు తీయడానికి సైతం వెనుకాడటం లేదు. గతకొద్దికాలంగా బంగ్లాదేశ్‌లో ఈ అరాచాకాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ చిన్నారి మదర్సాలోని ఓ ఉపాధ్యాయుడు తన పట్ల తప్పుగా ప్రవర్తించాడని ఫిర్యాదు చేసింది. దాంతో ఆ చిట్లితల్లిని అతి కిరాతకంగా కాల్చి చంపేశారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాక మదర్సాలో పిల్లలు ఎదుర్కొంటున్న భయంకర పరిస్థితుల గురించి ప్రపంచానికి వెల్లడించింది. బాలిక మృతితో దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు మదర్సా సిబ్బందిని అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటన తర్వాత చాలా మంది తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటకు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢాకా విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదువుతున్న హోజైఫా అల్‌ మమ్దుహ్‌ తాను ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించాడు.

ఆ వివరాలు.. ‘విద్యాభ్యాసం నిమిత్తం నేను ఢాకాలోని మూడు మదర్సాల్లో ఉన్నాను. ప్రతి చోట ఇలాంటి అకృత్యాలు చాలా సహజం. మదర్సాలో పని చేసే సిబ్బంది మాతో పాటు హస్టల్‌లోనే ఉండేవారు. సిబ్బందే కాక సీనియర్‌ విద్యార్థులు కూడా దారుణాలకు పాల్పడేవారు. పగలంతా ఏదో విధంగా గడిపిన విద్యార్థులు రాత్రి అవుతుందంటేనే భయంతో బిగుసుకుపోయేవారు. ఆ రాత్రి ఎవరికి కాళరాత్రిగా మారనుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడిపేవాళ్లం. దాదాపు మదర్సాలో ఉన్న ప్రతి విద్యార్థిపై ఈ అకృత్యాలు జరిగేవి. మేమంతా స్వయంగా బాధితులమే కాక ప్రత్యక్షంగా సాక్షులం కూడా. నేను కూడా ఈ నరకాన్ని అనుభవించాను. అది కూడా చాలా చిన్న వయసులో. ఏడేళ్ల వయసులో నాపై అత్యాచారం జరిగింది. నా సీనియర్లే నాతో ఇలా ప్రవర్తించారు. ఆ తర్వాత ఇలాంటి మరికొన్ని దారుణాల మధ్యే నా విద్యాభ్యాసం ముగిసింది. నాకు తెలిసిన చాలా మంది మదర్సా టీచర్లు పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని పాపంగా భావిస్తారు. కానీ పిల్లలతో లైంగిక సంబంధం కొనసాగించడం వారి దృష్టిలో పెద్ద నేరం కాదు. బాధితులు, నేరస్తులు ఒకే చోట ఉండటం మూలానా ఇలాంటి దారుణాలు బయటకు రావు. పైగా విద్యార్థులంతా పేదవారు కావడంతో మౌనంగా ఈ నరకాన్ని భరిస్తారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

హోజైఫా పోస్ట్‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ జర్నలిస్టు స్ఫూర్తితో మరి కొంత మంది ధైర్యంగా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న భయానక అనుభవాల గురించి వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో కొందరు మదర్సా నిర్వహకులు హోజైఫా వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అతడు యూదు మతానికి లేదా క్రిస్టియన్‌ మతానికి చెందిన వాడని.. అందుకనే ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మదర్సాలో చదవడం ఇష్టం లేని వారే ఇలాంటి ఆరోపణలు చేస్తారని మండి పడుతున్నారు. మదర్సాల ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు