ఖతర్నాక్‌ మహిళా ఎంపీ

23 Oct, 2019 21:02 IST|Sakshi
మహిళా ఎంపీ తమన్నా నస్రత్‌ తరఫున పరీక్ష రాస్తున్న ఆమె డూప్‌

8 మంది డూప్‌లను పెట్టుకొన్న మహిళా ఎంపీ

ఢాకా : ప్రపంచవ్యాప్తంగా ఓ మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెబుతారు. కానీ బంగ్లాదేశ్‌ ఎంపీ తమన్నా నస్రత్‌ తన లాంటి పోలికలు కలిగిన ఎనిమిది మందిని వెతికి పట్టుకున్నారు. అందులోను ఒక్క బంగ్లాదేశ్‌లోనే. బంగ్లాదేశ్‌ ఓపెన్‌ యూనివర్శిటీలో ‘బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిగ్రీ’ చదువుతున్న తమన్నా తాను రాయల్సిన 13 పరీక్షల కోసం ఈ ఎనిమిదిని ఎంపిక చేసుకున్నారు. వారికి వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ కూడా ఇప్పించారు. తనకు బదులుగా తనలాగా పోలికలున్న వారిని ఓపెన్‌ యూనివర్శిటీ ఎగ్జామినేషన్స్‌కు పంపిస్తూ వచ్చారు.

ఎవరికి అనుమానం రాకుండా ఎంపీగా తనకుండే బాడీ గార్డులను కూడా తన నకిలీల వెంట పరీక్ష హాల్లకు పంపిస్తూ వచ్చారు. కొన్ని పరీక్షలు ఆ డూప్‌లు ఎలాంటి అవాంతరాలు లేకుండానే తమన్నా తరఫున రాయగలిగారు. ఎంత ఎంపీగారి పోలికలున్నా తోటి విద్యార్థులు గుర్తు పడతారుకదా! మొదట్లో ఎంపీకి డూపులు వస్తున్నారని విద్యార్థులు గుర్తించారు. ఉన్నత స్థానంలో ఉన్న ధనిక కుటుంబానికి చెందిన ఎంపీ జోలికి తామెళ్లడం ఎందుకులే అనుకొని ఊరుకున్నారు. చివరికి ఆ నోట, ఈనోట ఆ విషయం బంగ్లాదేశ్‌ ప్రభుత్వ ‘నాగరిక్‌ టీవీ’కి తెల్సింది.

టీవీ సిబ్బంది పరీక్ష కేంద్రానికి వెళ్లి తమన్నా గెటప్‌లో పరీక్ష రాస్తున్న ఓ డూప్‌ను పట్టుకొని విచారించారు. ముందుగా తానే తమన్నా అంటూ సమర్థించుకున్న ఆ డూప్‌ టీవీ మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరి బిక్కిరై నిజం చెప్పేశారు. తానే కాకుండా తనలాంటి వాళ్లు మొత్తం ఎనిమిది మంది ఉన్నారని ఆమె చెప్పారు. ఆ డూప్‌లపై ఎలాంటి చర్య తీసుకున్నారో తెలియదుగానీ, ఎంపీ తమన్నాను మాత్రం యూనివర్శిటీ నుంచి బహిష్కరించినట్లు యూనివర్శిటీ హెడ్‌ ఎంఏ మన్నన్‌ తెలిపారు. తమన్నా అధికారంలో ఉన్న అవామీ లీగ్‌కు చెందిన ఎంపీ అవడంతో ఆమెపై ఎలాంటి చర్య తీసుకోవాలనే విషయంలో ఇంకా మల్లగుల్లాలు పడుతున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా