విపక్ష నేతలకు ఉరి ఖరారు

18 Nov, 2015 15:31 IST|Sakshi
విపక్ష నేతలకు ఉరి ఖరారు

ఢాకా: విపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు కీలక నేతలకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాకిస్థాన్ నుంచి విడిపోయే సందర్భంలో చోటుచేసుకున్న 1971 యుద్ధ సమయంలో అనేక నేరాలకు పాల్పడ్డారంటూ అలీ అహసాన్ మహమ్మద్ ముజాహిద్(67), సలాఉద్దీన్ ఖాదర్ చౌదరిల(66)కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరిశిక్షను బుధవారం సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో ఈ ఇద్దరు వృద్ధ నేతలను ఏ క్షణమైనా ఉరితీసేందుకు అనుమతి లభించినట్లయింది.

ప్రస్తుతం జమాతే ఇస్లామి(బంగ్లాదేశ్) పార్టీలో కీలకనేతగా ఉన్న మహమ్మద్ ముజాహిద్.. 1971 యుద్ధ సమయంలో వేలాది మైనారిటీ హిందువుల ఊచకోతలకు ప్రేరేపించడం, పలువురు మేధావులను హింసించడంతోపాటు వారిలో కొందరిని హత్య చేయించారనే ఆరోపణలున్నాయి. తనపై నమోదయిన ఐదుకేసుల్లోనూ ముజాహిద్ దోషిగా తేలారు.

 

ఇక ఖాదర్ చౌదరి విషయానికి వస్తే ప్రస్తుతం ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్ పీ)లో కీలక నేతగా ఉన్న ఆయన.. యుద్ధసమయంలో పెద్ద ఎత్తున సామూహిక హత్యాకాండలు జరిపించారని, ఇతర మతాలకు చెందిన గురువులను తీవ్రంగా హింసించారనే ఆరోపణలు నిజమేనని 2013లో నిర్ధారణ అయింది. కాగా, ప్రత్యేక న్యాయస్థానం విధించిన ఉరి శిక్షపై ఈ ఇరువురూ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా చుక్కెదురైంది.

1971 యుద్ధనేరాలపై పలు వివాదాలు చెలరేగుతుండటంతో ప్రధాని షేక్ హసీనా.. 2010లో సమగ్ రవిచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. యుద్ధ నేరాల్లో దోషులుగా తేలినవారిలో ఇప్పటికే కొద్దిమందికి మరణదండన అమలుకాగా, నేటి తీర్పుతో ఆ సంఖ్య పెరగనుంది. సుప్రీంతీర్పు నేపథ్యంలో ఆయా పార్టీల ప్రభావిత ప్రాంతాల్లో అలజడులు చెలరేగే అవకాశం ఉండటంతో గట్టి బందోబస్తుకు ఆదేశాలు జారీఅయ్యాయి.

>
మరిన్ని వార్తలు