డ్రగ్స్‌పై ఉక్కుపాదం : 140 మంది అంతం

8 Jun, 2018 17:25 IST|Sakshi

ఢాకా : బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మత్తు మందు వ్యాపారులపై(డ్రగ్‌ డీలర్స్‌) ఉక్కుపాదం మోపింది. కేవలం మూడువారాల్లోనే 140 మంది డ్రగ్‌ డీలర్స్‌ను అంతమొందించింది. మరో 18 వేల మందిని అదుపులోకి తీసుకుంది. దేశంలో నాటుకుపోయిన డ్రగ్‌ మాఫియాను నామారూపాల్లేకుండా చేయాలని ప్రధాని హసీనా కంకణం కట్టుకున్నారు. గత నెలలో ఆమె మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. అప్పటినుంచి డ్రగ్స్‌ సరఫరా చేసే వారిపై పోలీసులు దాడులు చేస్తున్నారు.

కాగా, డ్రగ్స్‌ డీలర్స్‌ మరణాలపై మానవ హక్కుల కార్యకర్తలు ఐకరాజ్యసమితిని(యూఎన్‌) సంప్రదించారు. దీనిపై స్పందించిన యూఎన్‌ ఈ హత్యలను తీవ్రంగా ఖండించింది. ఈ రక్తపాతాన్ని ఆపాల్సిందిగా బంగ్లా ప్రభుత్వాన్ని కోరింది. ఈ ఘటనలను బంగ్లాదేశ్‌ పోలీసులు సమర్ధించుకున్నారు. ముఠా తగాదాల వల్ల చాలా మంది చనిపోయినట్టు వారు పేర్కొన్నారు. వారిపై వస్తున్న విమర్శలకు ఫిలిప్పైన్స్‌లో డ్రగ్‌ మాఫియాపై జరిగిన దాడులను ఉదహరించారని ఇంటర్నెషనల్‌ డ్రగ్‌ పాలసీ కన్సార్టియమ్‌ యూఎన్‌కు నివేదించింది.

హింసతో, దాడులతో డ్రగ్‌ మాఫియాను తుదముట్టించలేమని కూడా తెలిపింది. ప్రధాని హసీనా మాత్రం ఈ మారణకాండపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. వీటికి ప్రజల నుంచి మద్దతు లభించడం.. 2018 చివర్లో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరుగుతుండటంతో హసీనా ఈ విధమైన ధోరణి అవలంభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె అధికారంలోకి వచ్చాక వేలాదిమంది డ్రగ్‌ డీలర్లపై ఉక్కుపాదం మోసి అంతమొందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు