జైలు నుంచి గే కార్యకర్తల విడుదల

15 Apr, 2016 14:54 IST|Sakshi

బెంగాలీల కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఇంద్రధనస్సు రంగులతో ప్రదర్శన చేసిన గే హక్కుల కార్యకర్తలను బంగ్లాదేశీ పోలీసులు అరెస్టు చేసి.. విడుదల చేశారు. వారిని పది గంటల పాటు పోలీసు స్టేషన్‌లోనే ఉంచి విచారించారని, ఆ తర్వాతే విడుదల చేశారని ఎల్జీబీటీ హక్కుల సంఘం రూప్‌బాన్ సభ్యుడు ఒకరు తెలిపారు. అరెస్టయిన నలుగురి బంధువులు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ వీళ్లు స్వలింగ సంపర్కులని, వాళ్ల సమస్య పరిష్కరించుకోవాలని సలహా ఇచ్చి విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఇంతకుముందు 2014, 2015 సంవత్సరాలలో కూడా రూప్‌బాన్ సంస్థ ఫేస్‌బుక్ ప్రచారంతో బంగ్లాదేశ్‌లో ఇలాంటి ప్రదర్శనలే నిర్వహించింది. ఇది వరుసగా మూడోసారి. భద్రతా కారణాల రీత్యా ఈసారి ప్రదర్శనకు తాము అనుమతి ఇవ్వలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ గ్రూపునకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీలో వాళ్లను చంపేస్తామని హెచ్చరిస్తూ కామెంట్లు వెల్లువెత్తినట్లు తెలిపారు. బంగ్లాదేశ్‌లో సెక్షన్ 377 ప్రకారం స్వలింగ సంపర్కం నేరం.

మరిన్ని వార్తలు