డాక్టర్లను వేడుకుంటున్న ట్రీ మ్యాన్‌

24 Jun, 2019 19:23 IST|Sakshi

ఢాకా : బంగ్లాదేశ్‌కు చెందిన అబ్దుల్‌ బజందర్‌ అనే వ్యక్తి ‘ట్రీ మ్యాన్‌ సిండ్రోమ్‌’ అనే వ్యాధితో బాధపడుతూ.. ట్రీ మ్యాన్‌గా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. శరీరంపై చెట్లల పొడుచుకొచ్చిన దద్దుర్లతో విపరీతంగా బాధపడ్డాడు. దాంతో వైద్యులు 2016లో అబ్దుల్‌కు దాదాపు 25 శస్త్ర చికిత్సలు చేసి అతని శరీరంపై వచ్చిన మొక్కల్లాంటి దద్దుర్లను తొలగించేశారు. ఆ తర్వాత అతనికి వ్యాధి పూర్తిగా నయమైందని భావించారు వైద్యులు. కానీ ఈ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈ ఏడాది మే నుంచి దద్దుర్లు మళ్లీ రావడం ప్రారంభించాయి.

ఈ సారి అరచేతుల నిండా ఈ చెట్లలాంటివి పుట్టుకొచ్చేశాయి. రిక్షా తొక్కుకు బతికే అబ్దుల్‌.. ఈ సమస్య కారణంగా చేతులతో పని చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. భరించలేని నొప్పితో విలవిల్లాడుతున్నాడు. ఈ క్రమంలో తన చేతులను తొలగించాల్సిందిగా డాక్టర్లను కోరుకుంటున్నాడు. ఈ విషయంలో అబ్దుల్‌ తల్లి కూడా అతనికే మద్దతు పలుకుతుంది. ‘నా కొడుకు బాధ చూడలేకపోతున్నాను. నొప్పితో విలవిల్లాడుతున్నాడు. రాత్రిళ్లు నిద్ర కూడా పోవడం లేదు. చేతులు తొలగిస్తే.. ఈ బాధ తప్పుతుంది’ అంటున్నారు.

విదేశాలకు వెళ్లి మెరుగైన చికిత్స తీసుకోవాలని భావిస్తున్నాను. అందుకు తన ఆర్థిక పరిస్థితులు అనుకూలించడం లేదంటున్నాడు అబ్దుల్‌. వైద్యులు మాట్లాడుతూ.. ‘నొప్పి తట్టుకోలేక అబ్దుల్‌ తన చేతులు తీసేయాల్సిందిగా కోరుతున్నాడు. కానీ వైద్యులుగా మేం అలా చేయలేం. త్వరలోనే అతని సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కొంటాం’ అని తెలిపారు. అహ్మద్‌కు భార్య, కూతురు ఉన్నారు. అతని ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. ఉచితంగా వైద్యం అందిస్తోంది. ఆస్పత్రిలోనూ అతనికి మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. అతడి పరిస్థితికి ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది.

>
మరిన్ని వార్తలు