16 ఆపరేషన్ల తర్వాత అతడికి ఆశ మొదలైంది

7 Jan, 2017 09:24 IST|Sakshi
16 ఆపరేషన్ల తర్వాత అతడికి ఆశ మొదలైంది

ఢాకా: వృక్ష మనిషి గుర్తున్నాడా.. దాదాపు ఏడాదికిందట అనూహ్యంగా వార్తల్లోకి ఎక్కి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.అత్యంత అరుదుగా వచ్చే వ్యాధి బారిన పడిన ప్రపంచంలోని నలుగురిలో ఇతడు కూడా ఒకడు. కాళ్లకు చేతులకు చెట్ల బెరడ్ల మాదిరిగా, పొగాడు కాడల్లా, చెట్ల వేర్ల మాదిరిగా వికృత ఆకృతులు పొడుచుకొచ్చి గుత్తుల్లా మాదిరిగా ఉండి బ్రతకడమే కష్టంగామారిన అతడి పరిస్థితి ఇప్పుడు మెరుగైంది. ప్రపంచం మొత్తం నివ్వెర పోయేలా ఆ వ్యాధి తిరిగి అతడి వైపు చూడకుండా పూర్తిగా బయటపడ్డాడు. దాదాపు 16 ఆపరేషన్లు చేసి అతడి మాములు మనిషిని చేశారు.

చదవండి..(కాళ్లు చేతులకు చెట్టు వేర్లు, బెరడ్లు మొలిస్తే..!)

దీంతో అతడు మరో నెల రోజుల్లో తన ఇంటి ముఖం చూడనున్నాడు. అందరిలో కలిసిపోనున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే బంగ్లాదేశ్లోని అబుల్ బజందర్ అనే 25 ఏళ్ల యువకుడు ప్రస్తుతం 'ఎపిడర్మోడిస్ప్లాషియా వెర్రసిఫార్మిస్' అనే అత్యంత అరుదైన జెనిటికల్‌ వ్యాధితో బాధపడుతుండే వాడు. ఈ వ్యాధికారణంగా అతడి చేతులు కాళ్లకు చెట్ల బెరడ్ల మాదిరిగా వికృత ఆకృతులు వచ్చి తీరని సమస్యతో జీవిస్తున్నాడు. దీంతో అతడికి వైద్యం చేసేందుకు ఓ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి ముందుకొచ్చింది. అతడి చేతికి, కాళ్లకు అలా రావడానికి కారణం ఓ చర్మ వ్యాధి అని వైద్యులు తెలుసుకున్నారు.


దాదాపు పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్న అతడికి శస్త్రచికిత్స చేసి నయం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. చెప్పిన మాట ప్రకారం పదహారు శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించిన వైద్యులు అతడిని మాములు మనిషిని చేశారు. దీంతో ఈ వ్యాధి వచ్చి పూర్తి కోలుకొని బయటపడుతున్న తొలి వ్యక్తిగా అబుల్‌ నిలవనున్నాడు. అతడి కాళ్లు, చేతి వేళ్లకు సంపూర్ణ ఆకృతినిచ్చేందుకు మైనర్‌ సర్జరీలు చేసి మరో 30 రోజుల్లో అతడిని డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. తాను మాములు మనిషిగా మారడంపట్ల అబుల్‌ పట్టరాని సంతోషం వ్యక్తం చేశాడు. తనకు ఇప్పుడు బతుకుపై ఆశపుడుతోందని చెప్పాడు.

మరిన్ని వార్తలు