‘ముత్యం లాంటి ముద్దు’పై వివాదమా!

26 Jul, 2018 13:11 IST|Sakshi
జిబాన్‌ అహ్మద్‌ తీసిన ఫొటో

సాక్షి, న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నగరం. అది ఢాకా యూనివర్శిటీ ప్రాంతం. అప్పుడే పెద్ద వర్షం కాస్త తుంపరగా మారింది. నేలంతా తడి తడిగా ఉంది. వెనకాల ఓ వినియోగదారుడు నెత్తున గొడుగు పట్టుకొని సెల్‌ఫోన్‌లో ఏదో వెతుక్కుంటున్నాడు. టీ కాసి పోసే వారిరువురు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. రోడ్డు మీద బాటసారులు ఇవేమి పట్టకుండా తమ మానాన తాము పోతున్నారు. సరిగ్గా ఆ సమయంలో అక్కడ కొంత ఎత్తైన అరుగులు మీద కూర్చున్న ఇద్దరు ప్రేమికులు తమకీ ప్రపంచం పట్టనట్టు ఒకరికొకరు అత్యంత సహజంగా ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ సన్నివేశంలో వారికి తెలియకుండా వారి ఫొటోను జిబాన్‌ అహ్మద్‌ తీశారు.

‘వర్షం దీవెనలతో విరిసిన కవిత, ప్రేమకు స్వేచ్ఛనివ్వండి’ అన్న నినాదంతో జిబాన్‌ అహ్మద్‌ ఆ ఫొటోను సోమవారం నాడు ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేయగా అది వైరల్‌ అవుతోంది. లౌకిక బెంగాలీ జాతీయ వాదం, ఇస్లాం ఛాందసవాదం మధ్య తీవ్ర సంఘర్షణలు జరిగే బంగ్లాలో ఈ ఫొటోపై పెద్ద దుమారమే రేగుతోంది. ఫొటోలో కనిపిస్తున్న కళాత్మక దృశ్యాన్ని మెచ్చుకుంటున్న వాళ్లు, బరితెగించిన ప్రేమగా అభివర్ణిస్తున్న వాళ్లు ఎక్కువే ఉన్నారు. ‘ఇదే నిజమైన బంగ్లాదేశ్‌. ఇలాంటి ప్రేమను పాటించడం వల్ల దేశంలో ఇస్లాం ఛాందసవాదం నశించిపోతుంది. నా బంగ్లాదేశ్‌ను ప్రేమిస్తున్నాను’ అంటూ కొందరు ‘మనం అంతటా ముద్దు పెట్టుకోవాలి. తరచుగా ముద్దు పెట్టుకోవాలి. ముద్దులతోనే వ్యతిరేకులపై పోరాటం సాగిద్దాం’ అంటూ మరికొందరు ట్వీట్లు పేల్చారు. స్వచ్ఛమైన నీటి బిందువులాంటి ముద్దుపై అసలు వివాదం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న వాళ్లూ ఉన్నారు.

బరితెగించిన ప్రేమగా పరిగణించిన యువకులు మాత్రం జిబాన్‌ అహ్మద్‌ను వెతికి పట్టుకొని రోడ్డుపైనే కర్రలతో కొట్టారు. కాళ్లతో తన్నారు. వారిలో తోటి ఫొటోగ్రాఫర్లు కూడా ఉండడం మరీ విచారకరం. జిబాన్‌ ఫొటోగ్రాఫర్‌ ఉద్యోగం కూడా పోయింది. ఆయన పనిచేస్తున్న వెబ్‌సైట్‌ యాజమాన్యం ఆయన్ని తొలగించింది. ఇస్లాం ఛాందసవాదులతో పెట్టుకోవడం జిబాన్‌ అహ్మద్‌కు ఇది మొదటిసారి కాదు. 2015లో బంగ్లాదేశ్‌–అమెరికన్‌ హేతువాద బ్లాగర్‌ అవిజిత్‌ రాయ్, ఆయన భార్యపై ఇస్లాం ఛాందసవాదులు హత్యాప్రయత్నం చేశారు. రక్తం వోడుతూ ప్రాణాపాయా స్థితిలో కాపాడంటూ రాయ్‌ భార్య వేడుకుంటుంటే ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో జిబాన్‌ అహ్మద్‌ను ఆస్పత్రికి చేర్చారు. అందుకు ఇస్లాం ఛాందసవాదుల చేతుల్లో తన్నులు తిన్నారు.

మరిన్ని వార్తలు