ఆటోడ్రైవర్‌కు మహిళా అభిమానుల బెడద

3 Nov, 2017 15:49 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల విడుదలైన హీరో రవితేజ ’రాజా ది గ్రేట్‌’  సినిమాలో చెప్పిన ఓ ఫోన్‌ నెంబర్‌ విశాఖకు చెందిన లంకలపల్లి గోపి అనే వ్యక్తిని ముప్పతిప్పలు పెట్టిన విషయం తెలిసిందే. విసుగెత్తిన అతడు చివరకు తన ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు కూడా. తాజాగా బంగ్లాదేశ్‌లోనూ అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితు...  అయన బంగ్లాదేశ్‌ స్టార్‌ హీరో ఏమీ కాదు. మామూలు ఆటో డ్రైవర్‌. అతడికి రోజూ వందల మంది మహిళా అభిమానులు ఫోన్‌ చేస్తున్నారు. అది భరించలేక అతడు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. అతడేమీ స్టార్‌ హీరో కాకపోయినా అన్ని ఫోన్లు రావడానికి కారణం మాత్రం బంగ్లాదేశ్‌ టాప్‌ హీరో షాకిబ్‌ ఖాన్‌. దాంతో తన జీవితాన్ని దుర్భరం చేసిన షాకిబ్‌ ఖాన్‌పై 50వేల పౌండ్లకు దావా వేయాలని నిర్ణయించుకున్నాడు ఆటోడ్రైవర్‌ ఇలాజుల్‌ మియా. హీరో ఖాన్‌కు, ఇలాజుల్‌ మియాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా ఇదంతా ఎందుకు జరిగిందంటే....

షాకిబ్‌ ఖాన్‌ నటించిన ‘రాజనీతి’ సినిమా ఇటీవల విడుదలయింది. ఈ సినిమాలో  హీరోయిన్‌కు షాకిబ్‌ ఖాన్‌ ఓ ఫోన్‌ నెంబర్‌ తనదంటూ ఇస్తాడు. అది నిజంగా హీరో ఫోన్‌ నెంబర్‌ అని హీరో మహిళా  అభిమానులు భావించారు. యాదృశ్చికంగా ఆ ఫోన్‌ నెంబర్‌ మన ఆటోరిక్షా డ్రైవర్‌ ఇలాజుల్‌ మియాది. వందలాది మంది మహిళా ఫ్యాన్‌... ఆ  ఫోన్‌ నెంబర్‌ హీరోది అనుకొని ఇలాజుల్‌ ఫోన్‌కు ఫోన్లు చేస్తూ వస్తున్నారు. అస్తమానం ఫోన్లు రావడంతో అతడికి.. ఇతర మహిళలతో అక్రమ సంబంధం ఉందని ఇలాజుల్‌ భార్య అనుమానించింది. అంతేకాకుండా ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ బెదిరిస్తూ వచ్చింది. ఆమెకే ఫోన్‌ ఇచ్చి చివరకు ఆ ఫోన్లు హీరోకు వస్తున్న ఫోన్లుగా తెలిసేలా చేసేడు. ప్రస్తుతానికి కొత్తగా పెళ్లయిన వారి మధ్య గొడవ సద్దు మణగింది.

ఆయితే ఫోన్లు మాత్రం ఆగడం లేదని ఇలాజుల్‌ మియా వాపోతున్నాడు. ఓ మహిళా అభిమాని అయితే తానుంటున్న చోటును కనుక్కొని 300 మైళ్ల దూరం నుంచి హీరో కోసం వచ్చిందని అతడు చెప్పుకొచ్చాడు. ఓ దశలో తాను ఫోన్‌ నెంబర్‌ మార్చుకుందామని అనుకున్నానని, అయితే తనను ఫోన్‌పై పిలిచే కస్టమర్లకు ఇబ్బంది అవుతుందని మార్చుకోలేదన్నాడు. 50వేల పౌండ్లకు కోర్టుకెళ్లి లాయర్‌ ద్వారా దావా కూడా వేశానని చెప్పాడు. అయితే దాన్ని విచారించేందుకు జడ్జీ స్వీకరించలేదని, ఫోన్‌ నెంబర్‌ వల్ల తనకు నిజంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయో, లేదో తెలుసుకునేందుకు దర్యాప్తుకు ఆదేశించారని చెప్పాడు. దర్యాప్తు అనంతరం తన దావాపై విచారణ జరిగే అవకాశం ఉందని అతడు తెలిపాడు.

మరిన్ని వార్తలు