ముందే మీడియాకు బన్సల్ సూసైడ్ లేఖలు

30 Sep, 2016 09:06 IST|Sakshi
ముందే మీడియాకు బన్సల్ సూసైడ్ లేఖలు

న్యూఢిల్లీ: అవినీతి కేసులో అరెస్టయి ఆత్మహత్యకు పాల్పడిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్ ఈ అఘాయిత్యానికి పాల్పడటానికి ఒక రోజు ముందే అన్ని మీడియాలకు తాను ఆత్మహత్య చేసుకుంటున్న కారణాలను వివరించిన లేఖలు పంపించినట్లు తెలిసింది. ఓ ఇద్దరు వ్యక్తులు ఈ లేఖలు కొరియర్ సంస్థకు ఇచ్చేందుకు విడివిడిగా రెండు బైకులపై వెళ్లారట. అదే రోజే సీబీఐకి కూడా ఒక లేఖను వారు పంపించారు.

అవినీతి కేసులో అరెస్టయిన కార్పొరేట్ వ్యవహారాల మాజీ డెరైక్టర్ జనరల్ బీకే బన్సల్(60), ఆయన కొడుకు యోగేశ్(30) మంగళవారం ఢిల్లీలోని వారి నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఓ ఔషధ కంపెనీ నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో జూలై 16న అరెస్టయిన బన్సల్ ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు నెలల కిందట ఆయన భార్య, కూతురు కూడా ఈ కేసు వల్ల అవమాన భారంతో  ఆత్మహత్య చేసుకున్నారు.

బన్సల్ తన భార్య ఆత్మహత్య చేసుకున్న గదిలో ఉరేసుకోగా, కొడుకు యోగేశ్ తన సోదరి చనిపోయిన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు సీబీఐ అధికారులు కారణం అని మీడియాకు లేఖల ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఆ లేఖలు చేరవేసిన కొరియర్ సంస్థగా వివరాలు వెల్లడించారు. లక్ష్మీ నగర్ లోని ఓ కొరియర్ సంస్థ వద్దకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు కొరియర్ వివరాలు అడిగారని మొత్తం ఎనిమిది లేఖలు ఇచ్చి అనంతరం వారి బైకులపై వెళ్లిపోయారని చెప్పారు.

మరిన్ని వార్తలు