ఒబామాపై విషం చిమ్ముతున్న డోనాల్డ్ ట్రంప్!

28 Feb, 2017 19:46 IST|Sakshi
ఒబామాపై విషం చిమ్ముతున్న డోనాల్డ్ ట్రంప్!

వాషింగ్టన్: అమెరికాలో జరుగుతున్న జాతివిద్వేష కాల్పులు, ఆపై చెలరేగుతున్న ఆందోళనలపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ ఆందోళనలకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే కారకుడని, వీటి వెనక ఉన్నది డెమొక్రాటిక్ ప్రతినిధులేనని మంగళవారం ఉదయం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. నిరసన, ఆందోళనల వెనక ఏదైనా రాజకీయ కోణం ఉందా అన్న విలేకరి ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. కచ్చితంగా ఈ ఆందోళనల వెనక ఒబామా హస్తం ఉందని, దీన్ని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. కాన్సస్‌లో గత బుధవారం యూఎస్ నేవీ మాజీ ఉద్యోగి ఫురింటన్ జరిపిన కాల్పుల్లో భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కూఛిబొట్ల శ్రీనివాస్ మృతిచెందగా, ఆయన స్నేహితుడు అలోక్ రెడ్డి గాయపడ్డారు. ట్రంప్ తీరుతోనే ఈ జాతి విద్వేషకాల్పులు జరుగతున్నాయని ఆందోళనలు మొదలయ్యాయి.

దేశ భద్రతపై కూడా బరాక్ ఒబామా సహా డెమొక్రాటిక్ నేతలకు ఎలాంటి ఆందోళన లేదని ట్రంప్ ఆరోపించారు. జాతీయ భద్రతకు సంబంధించిన విలువైన సమాచారాన్ని సైతం ఒబామా వర్గీయులు లీక్ చేస్తున్నారని.. భవిష్యత్తులోనే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పారు. ఈ నెల మొదట్లో ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, మెక్సికో అధ్యక్షుడు ఎన్నిక్ పెనా నిటోలతో తాను ఫొన్లో జరిపిన సంభాషణలకు సంబంధించిన ఎన్నో విషయాలను వైట్ హౌస్ నుంచి సేకరించి లీక్ చేశారని మీడియాకు తెలిపారు. ఫాక్స్ న్యూస్ మీడియా ప్రతినిధి జాన్ పాసాంటినో కూడా ఈ విషయంపై ట్వీట్ చేశారు.
 
నాన్ ప్రాఫిట్ గ్రూపు సంస్థ ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్.. డోనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించుకున్నాయని గత వారం ఫాక్స్ న్యూస్ రిపోర్టులో వెల్లడైంది. ఒబామా రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న సమయంలో(2012లో) ఎన్నికల ప్రచారకర్తల్లో ఒకరైన జిమ్ మెస్సినా, వైట్ హౌస్ మాజీ ఉద్యోగి జాన్ కార్సాన్ నేతృత్వంలో ఆర్గనైజింగ్ ఫర్ యాక్షన్ ఏర్పడిన విషయం విదితమే.

 

మరిన్ని వార్తలు