ఒబామా కొలువులో మరో భారతీయుడు

6 Oct, 2013 02:21 IST|Sakshi
ఒబామా కొలువులో మరో భారతీయుడు

వాషింగ్టన్: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మరో అత్యున్నత పదవి లభించింది. అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా కేరళకు చెందిన అరుణ్.ఎం.కుమార్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. క్లిష్టపరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అమెరికాను గాడిన పడవేయడానికి ఎగుమతులు పెంచాల్సిన అవసరం ఉందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి వరకు అరుణ్ కుమార్  కేపీఎంజీ కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యునిగా ఉన్నారు. శుక్రవారం అసిస్టెంట్ సెక్రటరీగా, అమెరికా విదేశీ వాణిజ్యసేవల విభాగం, అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. అరుణ్ గత నెల వరకు వెస్ట్‌కోస్ట్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ అధిపతిగా పనిచేశారు.  2007-2013 మధ్య అమెరికా-భారత వ్యవహారాలను పర్యవేక్షించారు. కేరళ వర్సిటీ నుంచి  భౌతికశాస్త్రంలో పట్టా పొందిన అరుణ్ అమెరికా వెళ్లి మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మేనేజ్‌మెంట్‌లో డి గ్రీ పుచ్చుకున్నారు.

మరిన్ని వార్తలు