ఆ ట్వీట్‌ను ఎక్కువ మంది ఇష్టపడ్డారు!

16 Aug, 2017 11:14 IST|Sakshi
ఆ ట్వీట్‌ను ఎక్కువ మంది ఇష్టపడ్డారు!

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. సోషల్‌ మీడియాలో ఆయన పోస్టులకు భారీ స్పందన లభిస్తోంది. వర్జీనియా రాష్ట్రంలోని చార్లెట్‌విల్ నగరంలో ఇటీవల జరిగిన దాడులపై స్పందిస్తూ ఒబామా పెట్టిన ట్వీట్‌ ఎక్కువ మంది ఇష్టపడిన ట్వీట్‌గా నిలిచింది.

దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్‌ మండేలా జీవితచరిత్ర 'లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడం' పుస్తకంలోని వాక్యాలను ఉటంకిస్తూ ఒబామా ట్వీట్‌ చేశారు. మనుషుల మధ్య ఉండాల్సింది విద్వేషం కాదని, ప్రేమని బోధిస్తున్న వాక్యాలను మూడు ట్వీట్లుగా పెట్టారు. మేరీల్యాండ్‌లో 2011లో తీసిన ఫొటోను మొదటి ట్వీట్‌లో పోస్ట్‌ చేశారు. దీనికి 28 లక్షల పైచిలుకు లైకులు వచ్చాయి. 11 లక్షలకు పైగా రీట్వీట్‌ చేశారు. ఒబామా ట్వీట్‌కు 45 వేల మందిపైగా జవాబిచ్చారు. ట్విటర్‌ చరిత్రలో అత్యధిక మంది ఇష్టపడిన ట్వీట్‌గా ఇది రికార్డుకెక్కింది.

పాప్‌ స్టార్‌ అరియానా గ్రాండే ట్వీట్‌ను ఒబామా ట్వీట్‌ వెనక్కు నెట్టిందని ట్విటర్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. మే నెలలో మాంచెస్టర్‌లో మ్యూజిక్‌ కన్సర్ట్‌పై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అరియానా గ్రాండే పెట్టిన ట్వీట్‌కు అప్పట్లో అత్యధిక లైకులు వచ్చాయి.

కాగా, చార్లెట్‌విల్‌లో.. అతివాద శ్వేతజాతీయులకు, మితవాదులకు మధ్య శుక్ర, శనివారాల్లో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు.
 

మరిన్ని వార్తలు