క్షమాపణ చెప్పిన బీబీసీ

27 Jan, 2020 20:31 IST|Sakshi
కోబ్‌ బ్రియాంట్‌, లిబ్రోన్‌ జేమ్స్‌

లండన్‌ : తాము ప్రసారం చేసిన వీడియోలో తప్పు దొర్లినందుకు ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ క్షమాపణలు తెలిపింది. అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ కోబ్‌ బ్రియాంట్‌ దుర్మరణానికి సంబంధించి బీబీసీ ఆదివారం పది గంటల బులిటెన్‌లో ఓ వార్తను ప్రసారం చేసింది. అయితే అందులో కోబ్‌కు బదులుగా లిబ్రోన్‌ జేమ్స్‌ చిత్రాలను చూపించారు. జేమ్స్‌, కోబ్‌ కెరీర్‌ పాయింట్లను అధిగమిస్తున్న వార్తను టెలికాస్ట్‌ చేశారు. దీంతో కోబ్‌కు బదులు జేమ్స్‌ స్క్రీన్‌ మీద ఎందుకు కనిపిస్తున్నాడనే దానిపై స్పష్టత లేకపోవడంతో వీక్షకులు ఆశ్చర్యపోయారు. బీబీసీ చేసిన తప్పిదాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సంస్థకు వ్యతిరేకంగా కామెంట్లు చేశారు. బీబీసీని ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఘాటుగా కూడా స్పందించారు.

వార్త ప్రసారంలో తప్పును గుర్తించిన బీబీసీ.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి బులిటెన్‌ చివర్లో న్యూస్‌ రీడర్‌ రీతా చక్రవర్తి చేత క్షమాపణలు చెప్పించింది. ‘కోబ్‌ మరణానికి సంబంధించిన వార్తను ప్రసారం చేసే సమయంలో.. ఒకానొక సందర్భంలో పొరపాటున కోబ్‌కు బదులుగా మరో బాస్కెట్‌బాల్‌ ఆటగాడు జేమ్స్‌ దృశ్యాలను ప్రసారం అయ్యాయ’ని రీతా పేర్కొన్నారు. అలాగే ఈ బులిటెన్‌ ముగిసిన కొద్ది సేపటికే బీబీసీ ఎడిటర్‌(సిక్స్‌ అండ్‌ టెన్‌) పాల్‌ రాయల్‌ ట్విటర్‌ ద్వారా క్షమాపణలు చెప్పారు. మానవ తప్పిదం వల్ల ఇలా జరిగిందన్న పాల్‌.. ఈ చర్య తమ సాధారణ ప్రమాణాలను తక్కువ చేసి చూపిందని అభిప్రాయపడ్డారు. 

గతంలో కూడా బీబీసీ ఇటువంటి తప్పిదానికి క్షమాపణ చెప్పింది.  2018 జూలైలో పాకిస్తాన్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు బదులుగా.. పాకిస్తాన్‌ బౌలర్‌ వసీమ్‌ అక్రమ్‌ దృశ్యాలను ప్రసారం చేసినందుకు బీబీసీ ప్రేక్షకులను క్షమాపణ కోరింది. కాగా, కోబ్‌ ప్రయాణిస్తున్న అతని ప్రయివేట్‌ హెలికా​ప్టర్‌ లాస్‌ఏంజిల్స్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కోబ్‌, అతని కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. తన 20 ఏళ్ల కెరీర్‌లో కోబ్‌ ఐదుసార్లు ఎన్‌బీఏ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నారు. అంతేకాకుండా అత్యధిక గోల్స్‌ సాధించిన టాప్‌ ప్లేయర్స్‌లలో కోబ్‌ బ్రియంట్‌ ఒకడిగా నిలిచారు.

చదవండి : కుమార్తెతో సహా బాస్కెట్‌బాల్‌ లెజెండ్‌ కోబ్‌ దుర్మరణం

ట్రంప్‌ ట్వీట్‌పై నెటిజన్ల మండిపాటు..

మరిన్ని వార్తలు