బుజ్జి ఎలుగుకు విముక్తి కలిగించిన పోలీసులు!

30 Aug, 2019 13:05 IST|Sakshi

డంప్‌స్టర్‌లో చిక్కుకున్న తోబుట్టువును బయటికి తీసేందుకు ఓ బుజ్జి ఎలుగుబంటి విశ్వప్రయత్నం చేసింది. తల్లితో కలిసి డంప్‌స్టర్‌ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఇంతలో పోలీసుల జీపు రావడంతో తల్లీ పిల్లా అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాయి. ఇక అప్పటిదాకా బుజ్జి ఎలుగుబంటి పాట్లు చూసిన పోలీసులు ఓ నిచ్చెన తెచ్చి డంప్‌స్టరులో ఉంచి అక్కడి నుంచి దూరంగా వెళ్లారు. ఈ క్రమంలో నిచ్చెన సహాయంతో లోపల ఉన్న ఎలుగుబంటి పైకి ఎక్కింది. ఈ తతంగాన్నంతా దూరంగా ఉండి గమనిస్తున్న తల్లి, సోదరుడి వద్దకు పరిగెత్తింది. ఆ తర్వాత మూడూ కలిసి అడవిలోకి పారిపోయాయి. 

కాలిఫోర్నియాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియెను ప్లేసర్‌ కంట్రీ షెరిఫ్‌ ఆఫీసు ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. తోబుట్టువును కాపాడుకునేందుకు బుజ్జి ఎలుగు పడిన తంటాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘మనుషులకే కాదు జంతువులకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. సూపర్‌ క్యూట్‌ బేర్‌’ అని కామెంట్లు చేస్తున్నారు. అదే విధంగా ఎలుగుబంట్లు తరచుగా జనావాసాల్లోకి రావడంపై స్పందిస్తూ... మనుషులకు, జంతువులకు ఎటువంటి హాని కలగకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు