థాయ్‌.. టూరిస్టుల స్వర్గధామం

16 Nov, 2016 10:42 IST|Sakshi
థాయ్‌.. టూరిస్టుల స్వర్గధామం

సుందరమైన బీచ్‌లకు నెలవైన థాయ్‌లాండ్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. సాగరజలాలు, అందమైన దీవుల్లో విహరించాలనుకునే వారికి ఇదో స్వర్గధామం. థాయ్‌లాండ్‌లో వందకుపైగా చిన్నచిన్న దీవులున్నాయి. ప్రతి దీవీ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నదే. ఏ దీవికి వెళ్లినా సందర్శకులు సరికొత్త అనుభూతికి లోనవుతారు. వాటిలో కొన్ని సుందర దీవుల గురించి తెలుసుకుందాం.. వినోదం, విశ్రాంతితోపాటు ఆధ్యాత్మిక అనుభూతిని సైతం ఈ దీవులు అందిస్తాయి.

కో ఫైఫై..
ఇదో ద్వీప సమూహం. కో ఫై ఫై డాన్, కో ఫైఫై లీ, కో యుంగ్, కోయ్‌ మాయ్‌ ఫాయ్, కో పాయ్, కో బిడా అనే ఆరు దీవులు కలిసి ఉన్న ద్వీప సమూహం కో ఫైఫై. దక్షిణ థాయ్‌లాండ్‌లోని క్రాబి ప్రాంతంలో కో ఫైఫై ఉంది. నీలి రంగులో ఉండే నీటితో, చుట్టూ పర్వతాలతో ఆకట్టుకునే ఈ దీవి 2004లో సునామీ ప్రభావానికి గురైంది. కొంతకాలం తర్వాత అధికారులు మళ్లీ ఈ దీవిని పునరుద్ధరించారు. భవిష్యత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావానికి గురికాకుండా, ఈ సారి ప్రణాళికాబద్ధంగా నిర్మాణాలు చేపట్టారు. అనేక సినిమాల చిత్రీకరణ ఈ దీవుల్లో జరిగినట్లు స్థానికులు చెబుతారు.

కో లాంటా..
క్రాబి ప్రాంతంలో ఉండే కో లాంటా దీవి సుందరమైన బీచ్‌లకు ప్రసిద్ధి. తెల్లటి ఇసుకతో కిలోమీటర్ల పొడవునా ఉండే ఇక్కడి బీచ్‌లు, పక్కనే ఉండే ఉష్ణమండల అడవులు పర్యాటకుల్ని అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఈ దీవిలో నిత్యం ఏదో ఒక ఫెస్టివల్‌ జరుగుతూనే ఉంటుంది. దీంతో పర్యాటకులు పోటెత్తుతుంటారు. స్కూబాడైవింగ్, స్నోర్కెలింగ్‌లకు ప్రసిద్ధి చెందిన ఈ దీవిలో లభించే రుచికరమైన ఫుడ్‌ మరో ఆకర్షణ. స్కూబాడైవింగ్‌ చేసేవారు సముద్ర జలాల్లోని దాదాపు వంద రకాల చేపలు, ఇతర జలచరాల్ని, 200కు పైగా కోరల్‌ రీఫ్స్‌ని అతి దగ్గరగా చూడొచ్చు. ఇక ఇక్కడి జాతీయ పార్కులో ఎలిఫెంట్‌ ట్రెక్కింగ్‌ సందర్శకులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని అందిస్తుంది. సముద్ర జలాలు చాలా పారదర్శకంగా ఉంటాయి. దీంతో ఈ నీటిలో ఆడుకుంటూ టూరిస్టులు ఉల్లాసంగా గడుపుతారు.

కో టావో..
తూర్పు థాయ్‌లాండ్‌ ప్రాంతంలో కో టావో అనే చిన్న దీవి ఉంది. స్థానిక భాషలో కో టావో అంటే తాబేలు దీవి అని అర్థం. ఈ దీవి తాబేలు ఆకారంలో ఉంటుంది కాబట్టి, దీనికి ఆ పేరు వచ్చింది. కో టావోకు వచ్చే సందర్శకుల్లో ఎక్కువగా డైవింగ్‌ నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ దాదాపు 20కి పైగా ప్రత్యేక డైవింగ్‌ శిక్షణ కేంద్రాలున్నాయి. బోట్‌ రైడింగ్‌ కూడా సందర్శకుల్ని ఎక్కువగా ఆకర్షించే అంశం. చిన్న చిన్న బోట్లను అద్దెకు తీసుకుని పర్యాటకులు దీవిని చుట్టి రావొచ్చు.


కో లైప్‌..
చాలా చిన్నగా ఉన్నప్పటికీ, ఎన్నో ఆకర్షణలు కలగిన కో లైప్‌ దీవి దక్షిణ థాయ్‌లాండ్‌లోని శాట¯ŒS ప్రాంతంలో ఉంది. ఇక్కడ పట్టాయా, సన్‌రైజ్, సన్‌సెట్‌ అనే మూడు బీచ్‌లు ఉన్నాయి. సముద్ర జలాలు నీలిరంగులో పారదర్శకంగా ఉంటాయి. సందర్శకులు బోట్‌ రైడింగ్, స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్‌ చేస్తూ సందడి చేస్తారు. కొత్తగా ఈత, డైవింగ్‌ నేర్చుకోవాలనుకునే వారికి ఈ దీవి అనువైనది. తెల్లటి ఇసుకతో కనిపించే బీచ్‌లో, పక్కనే ఏర్పాటు చేసిన రిసార్టుల్లో పర్యాటకులు సేదతీరుతారు. సాయంత్రం పూట మ్యూజిక్, డాన్స్‌లతో టూరిస్టులు ఉల్లాసంగా గడుపుతారు. థాయ్‌లాండ్‌లో ఎక్కువమంది టూరిస్టులు సందర్శించే దీవుల్లో ఇదీ ఒకటి.

కో చాంగ్‌..

థాయ్‌లాండ్‌లోని మూడో అతిపెద్ద దీవి కో చాంగ్‌. ఇది థాయ్‌-కంబోడియా సరిహద్దులో ఉంటుంది. దీవి చుట్టూ ఎత్తైన పర్వతాలు, సుందర జలపాతాలు, కోరల్‌ రీఫ్స్, పక్కన ఉన్న అడవి వంటివి అన్నీ కలిపి కో చాంగ్‌ దీవిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. పారదర్శకంగా, నీలి రంగులో ఉన్న నీరు, తెల్లటి ఇసుక పరుచుకున్న బీచ్‌లు, పచ్చని చెట్లతో ఉన్న వర్షారణ్యం, రిసార్టులు పర్యాటకులకు మధురానుభూతిని అందిస్తాయి. ఇతర దీవులతో పోలిస్తే ఇది చాలా దూరంలో ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న ప్రత్యేకతల దృష్ట్యా సందర్శకులు భారీగానే వస్తుంటారు.

కో సామెట్‌..
రాయంగ్‌ ప్రాంతంలో ఉన్న చిన్న దీవి కో సామెట్‌. ఈ దీవిలో సూర్యాస్తమయాన్ని వీక్షించడం పర్యాటకులకు ఓ ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. నీలి రంగులో ఉండే నీరు, తెలుపు రంగులో ఉండే మెత్తటి ఇసుకతో కూడిన అందమైన బీచ్‌లు అదనపు ఆకర్షణలు. పైగా ఈ దీవిలో ఏడాదంతా ఒకే రకమైన సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. రాత్రిపూట బీచుల్లోని రెస్టారెంట్లలో మ్యూజిక్, ఫుడ్‌తో సందర్శకులు సందడిగా గడుపుతారు. డైవింగ్, స్విమ్మింగ్, బోట్‌ రైడింగ్, ఫిషింగ్, విండ్‌సర్ఫింగ్‌ లాంటివి అసలైన మజాను అందిస్తాయి. ఏడాది పొడవునా సందర్శకులు ఈ దీవిని సందర్శిస్తుంటారు. 

మరిన్ని వార్తలు