జంబలకిడి పంబ.. వర్కవుట్ కాలేదు!

24 Apr, 2017 08:15 IST|Sakshi
జంబలకిడి పంబ.. వర్కవుట్ కాలేదు!

ఆంథోనీ నగోర్నీ.. అందాల పోటీలలో పాల్గొని విజేతగా కూడా నిలిచింది. కానీ కాసేపటి తర్వాత జడ్జీలు ఆమెకు ఇచ్చిన టైటిల్‌ను వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే.. ఈ పోటీలలో పాల్గొనడం కోసమే అంతకుముందు వరకు అబ్బాయి అయిన అతడు తన స్నేహితురాలి సాయంతో అమ్మాయిగా మారిపోయాడు!! ఆ విషయం జడ్జీలకు తెలిసిపోవడంతో టైటిల్ ఊడలాక్కున్నారు. సఖాలిన్ యూనివర్సిటీలో చదివే ఆంథోనీ.. ఆన్‌లైన్ పోటీ ద్వారా ఈ అందాల పోటీలోకి అడుగుపెట్టాడు. స్థానికంగా ఉండే ఓ లోదుస్తుల స్టోర్స్ వాల్లు బికినీలో అందమైన ఫొటో తీయించుకుని పంపాలని అడిగారు. ఆంథోనీ స్నేహితురాలు ఈ విషయంలో అతడికి సాయం చేసింది. జుట్టు నీట్‌గా కట్ చేసి, మేకప్ వేసి అతడిని మంచి 'అందగత్తె'గా తయారుచేసి మరీ ఫొటోలు తీయించి పంపించింది.

మిస్ అవకాడో అనే పేరుతో అతడు ఆన్‌లైన్ అందాల పోటీలో పాల్గొన్నాడు. అయితే ఎలా తెలిసిందో గానీ, జడ్జీలకు ఈ విషయం తెలిసిపోయింది. దాంతో వాళ్లు తమ నిర్ణయాన్ని మార్చుకుని.. అతడిని పోటీ నుంచి బహిష్కరించడమే కాక అతడు విజేత కాదని కూడా ప్రకటించారు. ఆ అబ్బాయి చూడ్డానికి అచ్చం అమ్మాయిలాగే ఉన్నాడని, ఫొటోలు అప్‌లోడ్ చేయడం సులభం కావడంతో అతడు చేసేశాడని లోదుస్తుల స్టోర్స్ యజమానులు చెప్పారు. ఇప్పుడు అతడు విజేత కాకపోవడంతో మరో ముగ్గురు అమ్మాయిలకు బహుమతి మొత్తాన్ని పంచుతున్నారు. ఆంథోనీ అమ్మాయిగా తీయించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతున్నాయి. అతడికి టైటిల్ ఇవ్వలేదని తెలిసి.. చాలామంది అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

మరిన్ని వార్తలు