మరోసారి లాక్‌డౌన్‌ దిశగా చైనా..!

13 Jun, 2020 12:39 IST|Sakshi

బీజింగ్‌ : ప్రాణాంతక కరోనా వైరస్‌ పురిటిగడ్డ చైనా మరోసారి లాక్‌డౌన్‌ దిశగా పయనిస్తోంది. వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసి కరోనా ఫ్రీ దేశంగా ప్రకటిద్దామని సిద్ధమవుతున్న తరుణంలో కొత్త కేసులు వెలుగు చూడటం ఆ దేశంలో కలకలం రేపుతోంది. చైనా ఆరోగ్యశాఖ అధికారుల సమాచారం ప్రకారం.. శుక్రవారం నాలుగు పాజిటివ్‌ కేసులు, శనివారం మరో ఏడు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇవ్వన్నీ కూడా రాజధాని నగరం బీజింగ్‌లోనే నమోదు కావడం గమనార్హం. పాజిటివ్‌గా సోకిన వారితో కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారందరినీ కోవిడ్‌ కేంద్రాలకు తరలించి పరీక్షలు నిర్వహించనున్నారు.  కాగా గడిచిన 55 రోజుల్లో కనీసం ఒక్క కరోనా కేసు కూడా ఆ దేశంలో నమోదు కాలేదు. అయితే ఊహించని విధంగా ఒక్కసారే పాజిటివ్‌ కేసులు వెలుగుచూడటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. (2 నెల‌ల త‌ర్వాత‌ బీజింగ్‌లో మ‌ళ్లీ క‌రోనా)

మరోరెండు రోజులపాటు ఇలానే కొత్త కేసులు బయటపడితే.. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. మొదటిసారి దేశంలో కరోనా వెలుగుచూసిన సమయంలో కట్టుదిట్టమైన లాక్‌డౌన్‌ను పాటించడం మూలంగానే వైరస్ వ్యాప్తిని పూర్తిగా కట్టడి చేయగలింది. దీంతో రెండో విడత కరోనా వ్యాప్తి చెందితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని చైనా వైద్య అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా చైనాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83,086కు చేరింది. వీరిలో 78,367 మంది కరోనాను జయించగా.. 4634 మంది చనిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో 85 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రెండోదశ వైరస్‌ వ్యాప్తి చెందకముందే లాక్‌డౌన్‌ ప్రకటించడం మేలని అధికారులు భావిస్తున్నారు. (రాజకీయ నేతలకు కరోనా భయం)

మరిన్ని వార్తలు