డ్రాగన్‌ మరో ఎత్తుగడ

18 Apr, 2018 18:23 IST|Sakshi

బీజింగ్‌: జిత్తులమారి చైనా తన సరిహద్దు ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు మరో ప్రయత్నం మొదలుపెట్టింది. భారత్‌ను చేరుకునేందుకు చైనా-నేపాల్‌-భారత్‌ బెల్ట్ అండ్ రోడ్ ప్రతిపాదనను ముందుకుతెచ్చింది. ఇప్పటికే భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని ఆత్రుతతో ఉన్న చైనా మరో ముందడుగు వేసింది. అందులో భాగంగా నేపాల్‌ మీదుగా భారత్‌-చైనా ఆర్థిక కారిడార్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యి బుధవారం వెల్లడించారు.

మరోవైపు నేపాల్‌ కొత్త ప్రధానిగా ఎన్నికైన కెపి ఓలీ శర్మ ప్రభుత్వంపైనా  ప్రభావం మరింత పెంచుకోవాలని చైనా భావిస్తోంది.  ఈ వ్యూహంలో భాగంగానే డ్రాగన్‌ పావులు కదుపుతోంది. నేపాల్‌ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని బీజింగ్‌ ప్రభుత్వం ప్రకటించింది. చైనా పర్యటనలో ఉన్న నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గైవాలితో కలిసి బీజింగ్‌లో వాంగ్‌ యి చైనా-నేపాల్‌-ఇండియా ఆర్థిక కారిడార్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రకటించారు.
 
నేపాల్‌తో బహుళ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు ఇరు దేశాల నేతలు ప్రకటించారు. బెల్ట్ అండ్ రోడ్ ద్వారా నేపాల్‌  భౌగోళిక ప్రయోజనాన్ని, చైనా- భారత్‌ సంబంధాలు బలపరిచేందుకు మూడు దేశాలను  అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్‌ నిర్మించాలని భావిస్తున్నట్లు వాంగ్‌ యి తెలిపారు. ఇటివల నేపాల్‌ ప్రధానిగా ఎన్నికైన కెపి శర్మ భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఓపీ శర్మ పర్యటన అనంతరమే నేపాల్‌ విదేశాంగ మంత్రి చైనా పర్యటించడం చర్చనీయాంశంగా మారింది. చైనా, భారత్‌, నేపాల్‌ భాగస్వామ్య దేశాలని, నదులు పర్వతాలతో తమ దేశాల మధ్య విడదీయలేని బందం ఉందని వాంగ్‌ యి పేర్కొన్నారు.  నేపాల్‌ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని చైనా-భారత్‌ సామరస్యంతో మెలగాలని వాంగ్‌యి అభిప్రాయపడ్డారు. ​కాగా చైనా-టిబెట్‌-భారత్‌  రైల్వే కనెక్టిటివిటీని కూడా గతంలో ప్రతిపాధించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు