బీజేపీ గెలిస్తే చర్చలకు అవకాశం

11 Apr, 2019 04:25 IST|Sakshi

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్య

ఇస్లామాబాద్‌/న్యూఢిల్లీ: భారత్‌తో శాంతి చర్చలకు, కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపుతో ఎక్కువ అవకాశాలున్నాయని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అన్నారు. బుధవారం కొందరు  జర్నలిస్టులతో ఇమ్రాన్‌ మాట్లాడారు. ‘బీజేపీ మళ్లీ గెలిస్తే, కశ్మీర్‌ వివాదంపై ఒక పరిష్కారానికి అవకాశం ఉంటుంది. ఇతర పార్టీలు గెలిస్తే హిందుత్వ వాదుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో ఈ వివాదం పరిష్కారానికి వెనుకంజవేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే జైషే మొహమ్మద్‌ సహా దేశంలోని అన్ని ఉగ్ర సంస్థలపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ‘జైషే మొహమ్మద్‌ తదితర సంస్థలకు చెందిన ఉగ్రవాదులను నిరాయుధులను చేశాం. ఈ సంస్థల యాజమాన్యంలో ఉన్న పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది’ అని వివరించారు. ఉగ్ర సంస్థల విషయంలో అంతర్జాతీయ సమాజం వైఖరికి భిన్నంగా పాక్‌ నడుస్తోందన్న వాదనను ఇమ్రాన్‌ కొట్టిపారేశారు.  

బీజేపీకి ఓటు.. పాక్‌కు వేసినట్లే
ఇమ్రాన్‌ఖాన్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. ప్రధాని మోదీ, ఇమ్రాన్‌తో కుమ్మక్కయ్యారని స్పష్టమవుతోందని ఆ పార్టీ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. ‘పాక్‌ అధికారికంగా మోదీతో జట్టుకట్టింది. మోదీకి ఓటేస్తే పాకిస్తాన్‌కు ఓటేసినట్లే’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘మోదీ జీ అప్పట్లో నవాజ్‌ షరీఫ్‌తో సన్నిహితంగా ఉన్నారు. తాజాగా ఇమ్రాన్‌ఖాన్‌ దగ్గరి స్నేహితుడయ్యారు’ అని వ్యాఖ్యానించారు. భారత ప్రధానిగా ఎవరుండాలని పాక్‌ కోరుకుంటోందో ఇమ్రాన్‌ వ్యాఖ్యలతో అర్థమైందని సీపీఎం కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రధానాంశం పాక్‌ ఒక్కటే. పాకిస్తాన్‌ను ప్రతిపక్షాలతో లింకు పెడుతూ ఆయన మాట్లాడారు. ఇప్పుడు, ప్రధానిగా మోదీ ఉండాలని పాక్‌ అంటోంది.  ఆహ్వానించకున్నా పాక్‌ వెళ్లిన ఏకైక ప్రధాని, సైనిక స్థావరంలోకి పాక్‌ ఐఎస్‌ఐను ఆహ్వానించిన ఏకైక భారత ప్రధాని మోదీయే’ అని ఆయన ఎద్దేవాచేశారు.

మరిన్ని వార్తలు