తోకలేని పిట్ట 45 ఏళ్లు లేటు!

24 Apr, 2014 05:04 IST|Sakshi
తోకలేని పిట్ట 45 ఏళ్లు లేటు!

మాంట్రియల్: తోకలేని పిట్ట తొంభై ఊళ్లు తిరిగిందో లేదో తెలియదు కానీ, కెనడాలో పోస్టు చేసిన ఒక ఉత్తరం మాత్రం  45 ఏళ్ల తరువాత చిరునామా వెతుక్కొని వాలింది.  కెనడాకు చెందిన ఆర్.డి. టింగ్లేకు ఆమె తోబుట్టువు 1969లో రాసిన ఉత్తరం 45 ఏళ్ల తర్వాత వాళ్ల ఇంటి అడ్రస్‌కు వచ్చింది. ప్లాస్టిక్ కవరుతో అంతికించి ఉన్న ఆ ఉత్తరంలో కొంత భాగం దెబ్బతింది. దానితో పాటు వచ్చిన మరో లేఖలో తపాలా సిబ్బంది ఆలస్యానికి చింతిస్తున్నట్లు వివరణ కూడా ఇవ్వడం విశేషం.
 
 అయితే లెత్‌బిడ్జ్ ్రనుంచి రాసిన ఈ ఉత్తరం చిరునామాలో మిస్టర్ అండ్ మిస్సెస్ ఆర్.డి.టింగ్లే పేరుతో పాటు స్ట్రీట్ నంబర్ సరిగానే ఉన్నా... ఇంటినంబర్ మాత్రం తప్పుగా రాశారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే టింగ్లే ఆ ఇంటి నుంచి మరో చోటికి వెళ్లినా ఆమెనే వెతుక్కుంటూ ఉత్తరం రావడం గమనార్హం.  దీనిపై టింగ్లే స్పందిస్తూ... ఈ ఉత్తరం నా కొత్త అడ్రస్‌కు ఎలా వచ్చిందో తెలియడం లేదు. కానీ, గతంలోనే నా ఇంటి అడ్రస్ మార్చినట్లు తపాలా శాఖకు తెలిపాను. తొమ్మిదేళ్ల వయసులో నా సోదరి ఈ ఉత్తరం రాసింది. ఆరు సెంట్ల విలువ కలిగిన స్టాంపు ఉత్తరానికి అతికించి ఉంది’ అని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు