విమానం కూలిపోతుందేమో అనుకున్నారు

23 Mar, 2017 17:02 IST|Sakshi



సిడ్నీ: వారం రోజుల్లోనే ఆస్ట్రేలియాలో మరో విమానం భయపెట్టింది. అంతకుముందు గాల్లో ఉండగా ఓ విమానం భయపెట్టగా తాజాగా ప్రొపెల్లర్‌ పడిపోయిన ఘటన సంభవించింది. అనూహ్యంగా భారీ శబ్దం రావడంతోపాటు విమానం మొత్తం వణికిపోవడంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలెట్‌ చాక చక్యంగా లోపం తలెత్తిన ఇంజిన్‌ను ఆపేసి విమానాన్ని దింపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ది రీజినల్‌ ఎక్స్‌ప్రెస్‌(ఆర్‌ఈఎక్స్‌) అనే విమానం 23మంది ప్రయాణికులతో సిడ్నీకి బయలుదేరింది. అయితే, విమానం గాల్లో ఉండగానే అనూహ్య మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా ఇంజిన్‌లో శబ్దం భారీగా పెరిగింది. దాంతో విమానం మొత్తం తుఫాను తాకిడికి గురైన దాని మాదిరిగా వణికిపోయింది. దీంతో పది నిమిషాల్లోనే డుబ్బూ అనే ప్రాంతంలో విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. విమానం కూలుతుందా అని అన్నంత ప్రయాణికుల బెంబేలెత్తిపోయారు.

ఓ ప్రయాణికుడు తన అనుభవాన్ని చెబుతూ ‘నేను విమానం ఇంజిన్‌ పక్కన ఉన్న సీట్లో కూర్చున్నాను. అందులో నుంచి నెమ్మదిగా మంటలు, పొగ రావడం గమనించాను. ఆ వెంటనే పెద్ద శబ్దం వచ్చింది. విమానం మొత్తం వణికిపోయింది. ఇంతలో ఇంజిన్‌ ఆగిపోయింది. పది నిమిషాల్లో విమానాన్ని ల్యాండ్‌ చేశారు’ అని చెప్పాడు. ఈ వారం తొలి రోజులో కూడా ఇదే కంపెనీకి చెందిన విమానం ఇబ్బందులు సృష్టించింది. దాదాపు 58 ప్రాంతాలకు వారానికి 1,500 సర్వీసులు అందిస్తున్న ఈ కంపెనీకి చెందిన విమానాలు ప్రస్తుతం ప్రొఫెల్లర్స్‌, గేర్‌ బాక్స్‌ సమస్యలు ఎదుర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు