పెద్ద దోమా.. కుట్టదమ్మా!

6 May, 2018 00:52 IST|Sakshi

దోమతో కుట్టించుకోవాలని ఎవరికైనా ఉంటుందా.. వాటిని ఇంట్లో నుంచి పంపేందుకు నానా తంటాలు పడుతుంటాం. మరి అంతచిన్న దోమ విషయంలోనే ఇలా ఉంటే మరి అరచేతి పరిమాణంలో ఉండే దోమ కుడితే మన పరిస్థితి ఏంటి? మనం చూసే దోమ కన్నా 10 రెట్లు పెద్ద దోమ మన ఇంట్లోకి చేరితే ఇంకేమైనా ఉందా.. అందుకోసం పెద్ద పెద్ద దోమల బ్యాట్స్‌ కొనే పరిస్థితి వస్తుందేమో..! ఇంతకీ ఈ దోమ విశేషాలేంటంటే.. దోమను చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లో పరిశోధకులు గుర్తించారు.

భారీ సైజులో ఉన్న ఈ దోమ జపాన్‌కు హలోరుసియా మికాడో అనే జాతికి చెందిందని చెప్పారు. సాధారణంగా ఈ జాతి దోమలు 8 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాయని, కానీ ఈ దోమ మాత్రం 11.15 సెంటీమీటర్లు ఉందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద దోమగా దీన్ని పరిగణిస్తున్నట్లు చెప్పారు. సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ దోమ ఎవరినీ కుట్టదట.

లార్వాలను తిని జీవనం సాగిస్తుందట. ఇక మీరు ఊపిరి పీల్చుకోవచ్చు.. ఇక ఈ దోమ మీ ఇంట్లోకి రాదు.. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని కుట్టదు! ఇంకో విషయం ఏంటంటే ఈ దోమ కేవలం 7 రోజులు మాత్రమే బతుకుతుందట.

మరిన్ని వార్తలు