ముషారఫ్‌కు భారీ ఊరట

14 Jan, 2020 02:22 IST|Sakshi

మరణ శిక్షను రద్దు చేసిన లాహోర్‌ హైకోర్టు

లాహోర్‌: పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు మరణ శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్‌ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును లాహోర్‌ హైకోర్టు కొట్టివేసింది. ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, ప్రత్యేక కోర్టు ఏర్పాటు, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు.. అన్నీ చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అని తేల్చి చెప్పింది. 2013లో నాటి నవాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం ఈ కేసు నమోదు చేసింది. ఆరేళ్ల పాటు ప్రత్యేక కోర్టు విచారణ జరిపి గత డిసెంబర్‌లో ముషారఫ్‌కు మరణ శిక్ష విధిస్తూ తీర్పు ప్రకటించింది.

ప్రత్యేక కోర్టు ఏర్పాటును, ఆ కోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ముషారఫ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం లాహోర్‌ హైకోర్టులోని జస్టిస్‌ సయ్యద్‌ మజహర్‌ అలీ అక్బర్‌ నఖ్వీ, జస్టిస్‌ మొహ్మద్‌ అమీర్‌ భట్టీ, జస్టిస్‌ చౌధరి మసూద్‌ జహంగీర్‌ల త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. ముషారఫ్‌పై నమోదైన దేశద్రోహం కేసు కూడా చట్టప్రకారం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘కేసు నమోదు నుంచి ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం వరకు అన్నీ రాజ్యాంగ వ్యతిరేకమని లాహోర్‌ హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది’ అని పాకిస్తాన్‌ అదనపు అటార్నీ జనరల్‌ ఇష్తియాక్‌ ఖాన్‌ తెలిపారు. ఈ తీర్పుతో జనరల్‌ ముషారఫ్‌కు స్వేచ్ఛ లభించిందన్నారు. కాగా, లాహోర్‌ హైకోర్టు తీర్పుపై జనరల్‌ ముషారఫ్‌ హర్షం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు