భేటీలో మాదే కీలకపాత్ర:చైనా

13 Jun, 2018 01:52 IST|Sakshi

బీజింగ్‌: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ భేటీ అవ్వడంలో తాము కీలక పాత్ర పోషించామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ అన్నారు. భవిష్యత్తులోనూ అమెరికా, చైనాల మధ్య సయోధ్య కొనసాగేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ‘సంపూర్ణ అణు నిరాయుధీకరణ జరిగితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. కొరియా ద్వీపకల్పంలో మనం శాంతిని నెలకొల్పాలి.

ఉత్తర కొరియాకు ఉన్న భద్రతాపరమైన భయాలను పోగొట్టాలి’ అని అన్నారు. ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలను చైనా విధిగా అమలు చేయడం లేదంటూ ట్రంప్‌ చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఉత్తర కొరియాకు చైనా మిత్రదేశంగా ఉండటం తెలిసిందే. కిమ్‌ సింగపూర్‌కు వెళ్లేందుకు విమానాన్ని కూడా చైనాయే ఏర్పాటు చేసింది. కిమ్‌ త్వరలోనే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలసి ట్రంప్‌తో చర్చలు సాగిన తీరును వివరిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.

అణు నిరాయుధీకరణకు తొలి అడుగు: షింజో అబే
టోక్యో: ట్రంప్, కిమ్‌ల భేటీ ఫలప్రదం కావడంతో కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు తొలి అడుగు పడిందని జపాన్‌ ప్రధాని షింజో అబే అన్నారు. జపాన్‌ ప్రజలను ఉత్తర కొరియా అపహరించడంపై కూడా కిమ్‌తో ట్రంప్‌ మాట్లాడటంపై అబే హర్షం వ్యక్తం చేశారు.

ప్రచ్ఛన్న యుద్ధం ముగుస్తుంది: మూన్‌
సియోల్‌: ట్రంప్, కిమ్‌ల భేటీ విజయవంతం కావడం పట్ల దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జే ఇన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ భేటీతో భూమిపై ప్రస్తుతం కొనసాగుతున్న చివరి ప్రచ్ఛన్న యుద్ధం  ముగుస్తుందన్నారు. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్, కిమ్‌లను మూన్‌ అభినందించారు. సింగపూర్‌లో ట్రంప్, కిమ్‌లు భేటీ అవ్వడంలో మూన్‌ జే ఇన్‌ పాత్ర కూడా కీలకం

భేటీ సానుకూలాంశం: రష్యా
మాస్కో: ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ శిఖరాగ్ర భేటీ సానుకూలాంశమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ పేర్కొన్నారు. ‘ఈ భేటీకి సంబంధించిన అధికార పత్రాలేవీ ఇప్పటి వరకు వెల్లడికాలేదు. అవి బహిర్గతం అవుతాయని భావిస్తున్నాం’ అని ఆయన అన్నారు.

గొప్ప ముందడుగు: సింగపూర్‌
సింగపూర్‌: ట్రంప్, కిమ్‌ల మధ్య భేటీ ఫలప్రదమై, ఒప్పందం కుదరడం గొప్ప ముందడుగని సింగపూర్‌ ప్రధాని లూంగ్‌ అన్నారు. సింగపూర్‌లో ఈ భేటీ జరగడం తమ దేశానికి దక్కిన గౌరవమన్నారు.. ‘కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణకు, శాంతి స్థాపనకు ఇదో కీలక తొలి అడుగు’ అని లేఖల్లో లీ పేర్కొన్నారు.

కీలక మైలురాయి: ఐరాస
ఐరాస: కొరియా ద్వీపకల్ప అణునిరాయుధీకరణ ప్రక్రియలో ట్రంప్, కిమ్‌ల మధ్య కుదిరిన ఒప్పందం ఓ కీలక మైలురాయి అని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ అన్నారు. ఈ ప్రక్రియలో అందరూ భాగం కావాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు.

తనిఖీలకు ఎప్పుడూ సిద్ధం: ఐఏఈఏ
వియన్నా:
అమెరికా, ఉత్తర కొరియాల మధ్య భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై అవసరమైనప్పు డు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ఐఏఈఏ (ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ) తెలిపింది. ఐఏఈఏ ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు