వ్యాక్సిన్‌ సరఫరాపై బిల్‌గేట్స్‌ కీలక వ్యాఖ్యలు

11 Jul, 2020 18:04 IST|Sakshi

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్‌ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మైక్రోసాఫ్ట్‌’ సహ వ్యవస్థాపకులు బిల్‌ గేట్స్‌ వ్యాక్సిన్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్‌ సరఫరాలో ఎక్కువ డబ్బులు బిడ్‌ చేసే వారికి కాకుండా.. అత్యంత అవసరమున్న దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇలాంటి మహమ్మారి సమయంలో డబ్బు గురించి కాకుండా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచం అత్యంత తీవ్రమైన మహమ్మారితో బాధపడుతుంది. ఇలాంటి సమయంలో డ్రగ్స్‌,  వ్యాక్సిన్‌ సరఫరాలో ఎక్కువ అవసరమున్న ప్రాంతాలకు, దేశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా డబ్బు గురించి ఆలోచిస్తే.. మహమ్మారి మరింత కాలం కొనసాగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నాయకులు మార్కెట్‌ శక్తులకు అడ్డుకట్ట వేసి అందరికి సమన్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకోవాలి’ అన్నారు. (కరోనా: ఐదేళ్ల ముందే చెప్పిన బిల్‌ గేట్స్‌!)

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కరోనా వైరస్‌ కట్టడి కోసం వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి. అమెరికా, యూరోప్‌ దేశాలు ఈ పరిశోధనలు, ట్రయల్స్‌పై వేల కోట్ల డాలర్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ధనిక దేశాలు కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేస్తే.. అభివృద్ధి చెందిన దేశాలకు అన్యాయం జరుగుతుంది అన్నారు బిల్‌గేట్స్‌. ‘రెండు దశాభ్దాల క్రితం వెలుగులోకి వచ్చిన ఎయిడ్స్‌  / హెచ్‌ఐవీకు మందులను అందుబాటులోకి తేవడం కోసం ప్రపంచదేశాలు అన్ని కలసికట్టుగా పని చేశాయి. ఫలితంగా ప్రస్తుతం ఆఫ్రికా వంటి దేశాల్లో కూడా హెచ్‌ఐవీకి మందులు అందుబాటులో ఉన్నాయి. కరోనా వైరస్‌ గురించి కూడా ఇలానే ప్రయత్నించాలి’ అని బిల్‌గేట్స్‌ సూచించారు. (కలిపి కొడితే కరోనా ఫట్‌?)

మరిన్ని వార్తలు