మానవ మలంతో వేదికపై బిల్‌గేట్స్‌

7 Nov, 2018 01:19 IST|Sakshi

బీజింగ్‌: పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ ధనికుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌ వింత పని చేశారు. మానవ వ్యర్థాన్ని ఓ గాజు సీసాలో సదస్సు వేదికపైకి తీసుకొచ్చారు. ఈ ఘటన చైనా రాజధాని బీజింగ్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ బీజింగ్‌లో ‘రీ ఇన్వెంటెడ్‌ టాయిలెట్‌ ఎక్స్‌పో’ పేరుతో పారిశుద్ధ్య రంగంలో సరికొత్త, చవకైన ఆవిష్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది.

ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌ మానవ వ్యర్థాల జాడీతో వేదికపైకి చేరుకుని మాట్లాడుతూ.. ‘ఆరోగ్యం, తినడానికి కావాల్సినంత ఆహారం.. ఒక మనిషికి కావాల్సింది ఇది మాత్రమే కాదు. ఈ జాబితాలో పరిశుభ్రమైన మరుగుదొడ్లను కూడా చేర్చాలి. ప్రపంచంలో సగం కంటే ఎక్కువ జనాభాకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు లేవు. చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ ప్రారంభించిన ‘టాయిలెట్‌ విప్లవం’తో దేశంలో పారిశుద్ధ్యం గణనీయంగా మెరుగైంది. ఈ పథకం అద్భుతం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు