డిగ్రీల్లేని బిలియనీర్లు..!

9 May, 2016 18:08 IST|Sakshi

పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయని,  కోరుకున్న కాలేజీలో సీటు దక్కలేదని, తల్లిదండ్రుల కారణంగా ఇష్టమైన కోర్సులో చేరలేకపోయామని బాధపడి.. అఘాయిత్యాలు చేసుకుంటోన్న యువతరాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రతిష్టాత్మక ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొంది, దాన్ని రెజ్యూమెలో అప్‌డేట్ చేసుకుని చూసుకుంటే బాగానే ఉంటుంది. కానీ, అది మన జీవితాన్ని ఎంత వరకూ ప్రభావితం చేస్తుందనేదే ప్రశ్న. డిగ్రీ పట్టాలు సాధించాలని కాలేజీల్లో చేరి, మధ్యలోనే నిష్ర్కమించి జీవిత గమనంలో విజేతలుగా మారినవారు మన చుట్టూ చాలా మందే ఉన్నారు. వారిలో కొందరు బిలియనీర్లూ అయ్యారు! డిగ్రీల్లేని ఆ బిలియనీర్లే వీరు!!

 స్టీవ్ జాబ్స్:
ప్రస్తుతం యువత క్రేజీగా వాడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ‘ఆపిల్’ సంస్థ తయారుచేసేవే అనడంలో సందేహం లేదు. ఐఫోన్, ఐప్యాడ్, ఐమ్యాక్, ఐవాచ్.. ఇలా ఏదైనా కానీ ఆపిల్ ఉత్పత్తులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపే వేరు. ఈ గుర్తింపునీ, అందుకు కారణమైన నాణ్యతనీ సంస్థకు అందించాడు ఆ కంపెనీ దివంగత సీఈవో స్టీవ్‌జాబ్స్. వీడియోగేమ్ డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. రెండేళ్లకే 1976లో సొంత కంపెనీ ప్రారంభించాడు. తర్వాత వీరి ప్రస్థానం ఓ చరిత్ర. అనతికాలంలోనే ఆపిల్ టెక్నాలజీ దిగ్గజంగా మారింది. వీరి చిన్నసైజు కంప్యూటర్లు వినియోగదారులను విపరీతంగా ఆకర్షించాయి. తన మేధ, నాయకత్వ లక్షణాలతో రూ.వందల కోట్లు సంపాదించిన జాబ్స్‌కు డిగ్రీ లేదు. రీడ్ కాలేజీలో చేరి, ఆరు నెలలకే చదువు ఆపేశాడు జాబ్స్!


ల్యారీ ఎల్లిసన్:
ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఒరాకిల్ అధినేత ల్యారీ ఎల్లిసన్‌దీ డిగ్రీ లేని కథే. 46 ఏళ్ల వయసులోనే అమెరికాలోనే మూడో సంపన్నుడిగా రికార్డు సృష్టించాడు. కానీ, డిగ్రీ మాత్రం సంపాదించుకోలేకపోయాడు. చిన్ననాటి నుంచీ చురుకైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న ఎల్లిసన్.. ఇల్లినాయిస్ యూనివర్సిటీ నుంచి ‘సైన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డునూ అందుకున్నాడు. అయితే, తన సవతి తల్లి చనిపోవడంతో రెండో ఏడాదే అక్కడ చదువు ఆపేశాడు. తర్వాత చికాగో యూనివర్సిటీలో చేరి, అక్కడా పూర్తి కాలం కొనసాగలేకపోయాడు. కంప్యూటర్ ప్రొగ్రామర్‌గా కెరీర్ ప్రారంభించి, సొంత కంపెనీ తెరిచాడు. కమర్షియల్ అప్లికేషన్లు తయారు చేస్తూ, ఐటీ ఇండస్ట్రీకి దన్నుగా నిలిచాడు.


బిల్ గేట్స్:
ప్రపంచవ్యాప్తంగా బిల్‌గేట్స్ పేరు తెలియనివారే లేరు. అంతగా సుపరిచితుడు ఈ టెక్నాలజీ రారాజు. ప్రపంచ సాఫ్ట్‌వేర్ విభాగాన్ని ఏలుతున్న మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడిగా ఎనలేని కీర్తి గడించాడు. దీంతో పాటే రూ.వేల కోట్లను తన బ్యాంక్ అకౌంట్లలో నింపుకొన్నాడు. అయితే, ఈయనకు కాలేజీ డిగ్రీ మాత్రం లేదండోయ్. హార్వర్డ్ లాంటి విఖ్యాత యూనివర్సిటీలో ప్రవేశం పొందినా, మధ్యలోనే చదువుకు స్వస్తి చెప్పాడు. దీనికి కారణం కూడా మైక్రోసాఫ్టే! అవును, 1975లో తన స్నేహితుడు పాల్ అలెన్‌తో కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్థాపించాడు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి పనుల్లో పడి, కాలేజీకి వెళ్లడం గేట్స్‌కు సాధ్యం కాలేదు. అయినప్పటికీ విజయవంతమైన వ్యాపారవేత్తగా, నాయకుడిగా ఎదిగాడు.


మార్క్ జుకెర్‌బర్గ్:
ప్రస్తుతం ఈమెయిల్ ఐడీ లేని వారున్నారేమో కానీ, ఫేస్‌బుక్ ఐడీ లేని వాళ్లు మాత్రం లేరంటే నమ్మాల్సిందే. నెటిజన్లలోకి అంతగా చొచ్చుకుపోయిందీ సోషల్ నె ట వర్కింగ్ సైట్. ఒకరకంగా చెప్పాలంటే నెటిజన్లు తమ సమయాన్ని చాలావరకూ నెట్టింట్లోనే గడిపేలా చేసింది ఫేస్‌బుక్కే. ఇంతటి సత్తా ఉన్న వెబ్‌సైట్ వ్యవస్థాపకుడికి డిగ్రీ కూడా లేదంటే నమ్ముతారా? కానీ, నిజమే! అతి చిన్న వయసులోనే బిలియనీర్‌గా మారిన మార్క్ జుకెర్‌బర్గ్.. హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే రోజుల్లోనే ఫేస్‌బుక్‌ను ప్రారంభించాడు. తొలుత యూనివర్సిటీకే పరిమితమైన ఈ వెబ్‌సైట్ తర్వాత రోజుల్లో విశ్వమంతా వ్యాపించింది. అలా తన వ్యాపారాన్ని మరింత విస్తరింపజేసేందుకే జుకెర్‌బర్గ్ 2004లో డిగ్రీని మధ్యలోనే వదిలేశాడు.


రాల్ఫ్ లారెన్:
ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ పోలో గురించి వినే ఉంటారు. ఈ బ్రాండ్‌ను ఇష్టపడని యువత ఉండరు. ముఖ్యంగా ఈ సంస్థ అందించే స్పోర్ట్స్ దుస్తులు ఎంతో ఆదరణ పొందాయి. దుస్తులనే కాదు.. ఫుట్‌వేర్, జువెల్లరీ, సుగంధ ద్రవ్యాలు, గృహోపకరణాలు ఇలా ‘రాల్ఫ్ లారెన్ కార్పొరేషన్’ నుంచి వచ్చిన ఏ వస్తువైనా ఎగబడి కొంటారు వినియోగదారులు. ఇంతటి ఘనమైన కంపెనీని నడిపేది ఎవరో తెలుసా? 75 ఏళ్ల రాల్ఫ్ లారెన్! ఫ్యాషన్ దిగ్గజంగా ఈయన పేరు పాశ్చాత్య దేశాల్లో మార్మోగి పోతుంది. కొన్ని వందల కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించిన రాల్ఫ్ కూడా డిగ్రీ పూర్తి చేయలేదు. బరూచ్ కాలేజీలో రెండేళ్ల పాటు చదివాక, మధ్యలోనే ఆపేసి, ఆర్మీలో చేరాడు. అక్కడ నెక్ టైలు కుట్టుకుంటూ వస్త్ర ప్రపంచంలోకి ప్రవేశించాడు. తర్వాత జరిగిందంతా చరిత్రే!

>
మరిన్ని వార్తలు