ప్రోత్సహించేవారూ బాధ్యులే

1 Sep, 2018 04:17 IST|Sakshi
కఠ్మాండులో బిమ్స్‌టెక్‌ దేశాధినేతలతో ప్రధాని మోదీ

ఏ రూపంలో ఉన్నా ఉగ్రహింస సమర్థనీయం కాదు

బిమ్స్‌టెక్‌ సదస్సు డిక్లరేషన్‌లో సభ్యదేశాలు

కఠ్మాండు: ఉగ్రవాదానికి మద్దతుగా నిలుస్తున్న దేశాలను గుర్తించి ఉగ్ర హింసకు వాటినీ బాధ్యుల్ని చేయాలని బిమ్స్‌టెక్‌(బంగాళాఖాత దేశాల ఆర్థిక, సాంకేతిక కూటమి) దేశాలు పిలుపునిచ్చాయి. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాద చర్యలు సమర్థనీయం కావని ఎండగట్టాయి. ఉగ్రవాదం, సీమాంతర వ్యవస్థీకృత నేరాలు ప్రపంచ శాంతికి పెను విఘాతం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. నేపాల్‌ రాజధాని కఠ్మాండులో నాలుగో బిమ్స్‌టెక్‌ దేశాల సదస్సు శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా 7 సభ్యదేశాలు ఏకాభిప్రాయంతో కఠ్మాండు డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. భారత్‌ నుంచి ప్రధాని మోదీ ఈ సమావేశానికి హాజరయ్యారు.

రెండు రోజుల సదస్సు ఫలప్రదంగా జరిగిందని, విభిన్న రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సభ్యదేశాలు పునరుద్ఘాటించాయని మోదీ తెలిపారు. ఇంధన రంగంలో సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి బిమ్స్‌టెక్‌ గ్రిడ్‌ ఇంటర్‌కనెక్షన్‌ ఏర్పాటుకు అవగాహనా ఒప్పందం కుదిరింది. పశుపతినాథ్‌ ఆలయ పరిసరాల్లో యాత్రికుల కోసం కొత్తగా నిర్మించిన ‘భారత్‌ నేపాల్‌ మైత్రి ధరమ్‌శాల’ను నేపాల్‌ ప్రధాని ఓలితో కలసి మోదీ ప్రారంభించారు. అనంతరం నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్‌ దేశాధినేతలతో విడిగా భేటీ అయ్యారు. తదుపరి బిమ్స్‌టెక్‌ సదస్సుకు శ్రీలంక ఆతిథ్యమివ్వనుంది.  

డిక్లరేషన్‌ ముఖ్యాంశాలు..
► ఉగ్రభూతం, సీమాంతర నేరాలపై పోరాటానికి గట్టి ప్రయత్నాలు జరగాలి. సభ్య దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పోత్సహించే సమగ్ర విధానాలు అవలంబించాలి.
► సభ్య దేశాల పోలీసులు, నిఘా వర్గాలు, న్యాయ వ్యవస్థ మధ్య సమన్వయం పెంచాలి.
► హోం మంత్రులు, జాతీయ భద్రతా అధికారుల సమావేశాలు తరచుగా నిర్వహించాలి.
► పరస్పర ఆర్థికాభివృద్ధి నిమిత్తం బహుళ రంగాల్లో సభ్యదేశాల మధ్య అనుసంధానత పెరగాలి.
► అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలు న్యాయబద్ధంగా, అన్ని దేశాలకు ఒకే విధంగా వర్తించేలా ఉండాలి.
► దక్షిణ, ఆగ్నేయాసియాకు వారధిగా ఉన్న బిమ్స్‌టెక్‌ను ప్రాంతీయ సర్వతోముఖాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలి.
► అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం పెద్ద అడ్డుగోడగా ఉంది. సుస్థిరాభివృద్ధికి 2030 ఎజెండాను అమలుచేయడానికి కృషి జరగాలి.
► వాతావరణ మార్పుపై అంతర ప్రభుత్వ నిపుణుల కమిటీ నియామకానికి అవకాశాలను పరిశీలించాలి.
► చివరగా, శాంతియుత, సుస్థిర, బలోపేత బిమ్స్‌టెక్‌ సాధనకు సభ్యదేశాలు కలసికట్టుగా పాటుపడాలి.

భాగమతి తీరంలో యాత్రికులకు బస..
పశుపతినాథ్‌ ఆలయ పరిసరాల్లో యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు నిర్మించిన 400 పడకల విడిది భవనాన్ని మోదీ, నేపాల్‌ ప్రధాని ఓలితో ప్రారంభించారు. భారత ఆర్థిక సాయంతో భాగమతి నదీ ఒడ్డున నిర్మించిన ఈ భవనంలో యాత్రికులు బస చేసేందుకు విశ్రాంతి గదులు, కిచెన్, భోజన శాల, లైబ్రరీ తదితర సౌకర్యాలను ఏర్పాటుచేశారు. ఇది కేవలం విశ్రాంతి భవనమే కాదని, భారత్‌–నేపాల్‌ల స్నేహానికి చిహ్నమని మోదీ వ్యాఖ్యానించారు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీ రచనల్ని నేపాలీ భాషలో ప్రచురించాలని నేపాల్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు, బిమ్స్‌టెక్‌ సదస్సు సందర్భంగా మోదీ నేపాల్, థాయ్‌లాండ్, మయన్మార్, భూటాన్‌ దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రాక్సాల్‌ (బిహార్‌)–కఠ్మాండు మధ్య వ్యూహాత్మక రైల్వే లైను నిర్మాణానికి భారత్, నేపాల్‌లు అవగాహనా ఒప్పందం(ఎంఓయూ) కదుర్చుకున్నాయి.

మరిన్ని వార్తలు