బెనజీర్‌ హత్య.. విస్మయపరిచే వాస్తవం!

28 Dec, 2017 10:56 IST|Sakshi

కరాచి : పాకిస్థాన్‌ మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో హత్య కేసులో సంచలన విషయాన్ని పాక్‌ వెల్లడించింది. ఆమె హత్య కుట్ర వెనక ఉంది ఆల్‌ఖైదా మాజీ చీఫ్‌ ఒసామా బిన్‌లాడెన్‌ అని పేర్కొంది. ఆమె మరణించి పదేళ్లు పూర్తి కావస్తున్నందున(డిసెంబర్‌ 27, 2017) పాక్‌ గూఢాచారి సంస్థ ఐఎస్‌ఐ రూపొందించిన ఓ నివేదికను ప్రభుత్వం బయటపెట్టింది.  

అల్‌ ఖైదా, బిన్‌ లాడెన్‌ ఆధ్వర్యంలోనే ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. అంతేకాదు ఆ సమయంలో బెనజీర్‌తోపాటు ముషార్రఫ్‌, జమైత్‌ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్‌ చీఫ్‌ ఫజ్లుర్‌ రెహమాన్‌ను కూడా లేపేయాలని లాడెన్‌ నిర్ణయించుకున్నాడు. ఇందుకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆర్మీ అధికారులు  హెచ్చరికలను జారీ చేశారు. ‘లాడెన్‌ తన కొరియర్‌ ముసా తరీఖ్‌ను ముల్తాన్‌కు పంపించాడు. వజిరిస్థాన్‌ నుంచి పెద్ద ఎత్తున్న పేలుడు పదార్థాలను ముసా తీసుకెళ్లాడు. వచ్చే ఆదివారం (డిసెంబర్‌ 22న) భారీ నర మేధానికి అల్‌ఖైదా  శ్రీకారం చుట్టింది’ అంటూ ఓ లేఖ ఆర్మీకి అందింది. మరుసటి రోజు అంటే సరిగ్గా ఆమె హత్యకు ఆరు రోజుల ముందు మరో హెచ్చరిక కూడా జారీ అయ్యింది. కానీ, ఆమె మాత్రం వాటిని పెడచెవిన పెట్టారు.

ఇక ఆ ఫ్లాన్‌ మొత్తం అఫ్ఘనిస్థాన్‌ నుంచి లాడెన్‌ స్వయంగా పర్యవేక్షించాడంట. ఈమేరకు డిసెంబర్‌ 27, 2007న రావల్పిండి వద్ద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమెను  బాంబు దాడిలో హత్య చేశారు. ఆమె హత్యానంతరం తమ ఫ్లాన్‌ సక్సెస్‌ అయినట్లు ఓ లేఖ కూడా లాడెన్‌కు అందినట్లు ఐఎస్‌ఐ పేర్కొంది. పరిస్థితులు చల్లబడ్డాకే లాడెన్‌ తిరిగి పాక్‌కి తిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ చేసింది లాడెనే అయినా ఆమె మరణం ద్వారా ఎక్కువ లబ్ధి(రాజకీయ) పొందాలనుకున్న వారే ఈ కుట్ర వెనుక ఉన్నారన్నది ఆమె అనుచరుల వాదన. అయితే అది ఎవరన్న ప్రశ్న పదేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.

కాగా, తమ భూభాగంలో లాడెన్‌ తలదాచుకోలేదని పాక్‌ వాదించినప్పటికీ.. అమెరికా భద్రతా దళాలు మాత్రం అబ్బోట్టాబాద్‌లో లాడెన్‌ ను(2011 మే నెలలో) మట్టుపెట్టిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు