జీవ యంత్రుడు!

2 Jul, 2014 04:07 IST|Sakshi
జీవ యంత్రుడు!

ఎలుక గుండె కణాలు, హైడ్రోజల్ పదార్థంతో తయారు చేసిన బయోలాజికల్ రోబో ఇది. ఓ కొత్త రకం బెంచీలా కనిపిస్తున్న ఈ బయోబోట్ మన రక్తనాళాల్లో పాకగలదు. అవసరమైతే ఈదగలదు కూడా. ఒక సెం.మీ. సైజు మాత్రమే ఉన్న దీనిని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయీ పరిశోధకులు రూపొందించారు. భారత సంతతికి చెందిన విద్యార్థిని రీతూ రామన్ కూడా ఈ ఆవిష్కరణలో సహ పరిశోధకురాలిగా కీలక పాత్ర పోషించింది. కంటి కటకాల్లో ఉపయోగించే హైడ్రోజల్‌తో త్రీడీ ప్రింటర్ ద్వారా దీనిని తయారు చేశారు. ఎలుక గుండె కండరాల కణాలను సేకరించి దీనికి కింది భాగంలో అమర్చారు.

ఎలుక గుండె కణాలు నిర్జీవం అయిపోకుండా ఎప్పటికప్పుడు పోషకద్రవాల్లో ఉంచుతూ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకేం.. విద్యుత్ క్షేత్రంలో దీనిని ఉంచినప్పుడు ఎలుక గుండె కణాలు సంకోచించడం, ఫలితంగా హైడ్రోజల్ దేహం ముందుకు కదలడం వంటివి సాధ్యం అయ్యాయి. పాదంలా ఉన్న నిర్మాణం ఈ రోబో తూలిపడిపోకుండా చూస్తుందట.  దీనిని మరింత అభివృద్ధిపర్చి రక్తనాళాల్లోకి పంపితే శరీరంలో విషాలను తొలగిస్తుందని, కేన్సర్ కణతుల వద్దకు వెళ్లి మందులను విడుదల చేస్తుందని, రకరకాల వైద్యపరీక్షలకు, చికిత్సలకూ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు