చెట్టునే నేలకు దించే పక్షి గూళ్లు..

24 Dec, 2017 02:27 IST|Sakshi

చిన్న చిన్న పుల్లలు, ఎండిపోయిన ఆకులు, ఇతరత్రా ఉపయోగించి పక్షులు ఎంతో నేర్పుగా చిన్నపాటి గూళ్లను నిర్మించుకుంటాయి. ఈ గూళ్లను గుడ్లు పెట్టేందుకు, నివాసం ఉండేందుకు అల్లుకుంటాయి. ఇలా నిర్మించే గూళ్లు చూడటానికి చాలా చిన్నవిగా.. అందంగా ఉండటంతోపాటు చాలా దృఢంగా ఉంటాయి. అయితే దక్షిణాఫ్రికాలో సోషల్‌ వేవర్స్‌(ఫిలేతైరస్‌ సోషియస్‌) అనే పక్షి జాతి ఒకటుంది. ఈ పక్షి కూడా గుడ్లు, తన పిల్లలు నివాసముండేందుకు గూళ్లు నిర్మించుకుంటుంది. అయితే ఈ పక్షి నిర్మించే గూళ్లకు చాలా అంటే.. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

సాధారణంగా మనం చూసే పక్షి గూళ్ల మాదిరిగా కాకుండా ఇవి పెద్దవిగా ఉంటాయి. ఎంత పెద్దగా అంటే.. ఏ చెట్టుపై అయితే ఈ గూళ్లను నిర్మిస్తాయో ఆ చెట్టును సైతం నేలకు దించేంత పెద్దవిగా, బరువుగా ఉంటాయి. ఒక్కో గూడు బరువు సుమారు టన్నుకుపైగానే ఉంటుంది. 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో సుమారు 100కు పైగా విడివిడి గదులతో చూడటానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. గూటిలోకి ప్రవేశించే ద్వారాన్ని 10 అంగుళాల పొడవు, అంగుళం వెడల్పు ఉండేలా అల్లుకుంటాయి.

ఈ గూళ్లు వందేళ్లు దాటినా కూడా చెక్కు చెదరకుండా పటిష్టంగా ఉంటాయి. ఒకసారి నిర్మించిన గూటినే ఈ జాతి పక్షులు తరతరాలుగా ఉపయోగించుకుంటాయి. ఇంతటి భారీ గూడు నిర్మాణమే పక్షులను ఎండ, వాన, కరువు, ఇతర ప్రకృతి ప్రమాదాల నుంచి తేలికగా కాపాడుతుందని వీటిని సందర్శించిన మియామీ యూనివర్సిటీకి చెందిన బయాలజిస్ట్‌ గెవిన్‌ లైటన్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు