ఫ్యూచరంతా కరెంటే!

1 Sep, 2017 02:15 IST|Sakshi
ఫ్యూచరంతా కరెంటే!

వావ్‌ ఫ్యాక్టర్‌
సందేహం ఏమీ లేదు.. రాబోయే కాలం మొత్తం విద్యుత్తు వాహనాలదే. ఇందుకు కావాల్సిన తార్కాణాలు ఇప్పటికే బోలెడన్ని కనిపించినా.. తాజాగా వేర్వేరు కంపెనీలు ఆవిష్కరించిన, ఆవిష్కరిస్తున్న కొత్త కార్లు, ప్రణాళికలు కూడా ఇదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. బీఎండబ్ల్యూ తన విద్యుత్తు కారు ఐ–3ని వచ్చే ఏడాది విడుదల చేస్తామని ప్రకటించగా, టెస్లా కంపెనీ దాదాపు 500 కిలోమీటర్ల పరిధితో లారీల్లాంటి వాహనాలను మార్కెట్‌లోకి తెస్తామంటోంది. ఇంకోవైపు రెనాల్ట్‌ కంపెనీ విద్యుత్తు వాహనాల చార్జింగ్‌ కోసం బంకులను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది. ముందుగా బీఎండబ్ల్యూ సంగతి చూద్దాం. ఐ–3 పేరుతో ఈ కంపెనీ విడుదల చేస్తున్నది ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ కార్‌! ఈ పేరుతో ఇప్పటికే విద్యుత్తు కార్లు నడుస్తున్నా.. మరింత శక్తిమంతమైన ఇంజిన్, డిజైన్‌ మార్పులతో వచ్చే ఏడాది స్పోర్ట్స్‌ కారు విడుదల చేయాలన్నది ప్రణాళిక. ఇది ఒకసారి చార్జ్‌ చేస్తే దాదాపు 270 కిలోమీటర్ల దూరం వెళ్లడమే కాకుండా, రేసుకారు మాదిరిగా చాలా వేగంగా.. కచ్చితంగా చెప్పాలంటే 6.8 సెకన్ల సమయంలో దాదాపు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అంతేకాకుండా ఐ3 బ్యాటరీలను చార్జ్‌ చేసుకోవడం కూడా చాలా వేగంగా జరిగిపోతుంది.

టెస్లా విషయానికొస్తే.. విద్యుత్తు కార్ల తయారీకి పెట్టిన పేరైన ఈ కంపెనీ విద్యుత్తుతో నడిచే ట్రక్కులను సిద్ధం చేస్తామని ప్రకటించింది. అమెరికాలో ఎక్కువ లారీలు వంద నుంచి 200 మైళ్ల దూరం ప్రయాణించేందుకు ఉపయోగిస్తుంటారు కాబట్టి ఈ కొత్త వాహనం మైలేజీ దీనికి దగ్గరగా ఉండేలా చూస్తున్నామని టెస్లా యజమాని ఎలన్‌ మస్క్‌ అంటున్నారు. చివరగా.. రెనాల్ట్‌ గురించి. ఈ యూరోపియన్‌ కార్ల కంపెనీ ఒక్కదెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఓ వినూత్న ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకవైపు హైవేల వెంబడి విద్యుత్తు కార్లను చార్జ్‌ చేసుకునే ఏర్పాట్లు చేస్తూనే.. భవిష్యత్తులో విద్యుత్తు కార్ల బ్యాటరీలను మళ్లీమళ్లీ వాడుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యుత్తు కార్లలో కొన్నేళ్ల తరువాత బ్యాటరీలను మార్చాలన్నది తెలిసిందే. ఇలా మార్చిన బ్యాటరీలను చార్జింగ్‌ స్టేషన్లలో ఉంచి ఇతర కార్లకు విద్యుత్తు సరఫరా చేసేందుకు వాడుకోవాలన్నది రెనాల్ట్‌ ప్లాన్‌!  ఇంకో ఐదారేళ్లకు కారు కొనాలని అనుకునే వారందరూ ఒక్కసారి ఆలోచించుకుని పెట్రోలు/డీజిల్‌ కారు కొనడమా? లేక విద్యుత్తు వాహనమా? అన్నది నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి అన్నమాట.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

>
మరిన్ని వార్తలు