డెయిరీ ఎలర్జీతో యువకుడి మృతి

16 Sep, 2019 14:10 IST|Sakshi

లండన్‌: ఒవెన్‌ కారీ అనే యువకుడు తన 18వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం కోసం లండన్‌ థేమ్స్‌ నది ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకల నిమిత్తం నది పక్కనే ఉన్న బైరన్‌ చైన్‌ అనే రెస్టారెంట్‌కు వెళ్లాడు. కేక్‌ కటింగ్‌ లాంటి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భోజనం ఆర్డర్‌ చేశాడు. అయితే ఒవెన్‌కు డెయిరీ ఎలర్జీ(పాల సంబంధిత ఉత్పత్తులు పడకపోవడం) ఉంది. చికెన్‌ బ్రెస్ట్‌ ఆర్డర్‌ చేసిన ఒవెన్‌ ఎందుకైనా మంచిదని తనకున్న డెయిరీ ఎలర్జీ గురించి హోటల్‌ యాజమాన్యానికి సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత ఆహారం రావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఎంజాయ్‌ చేస్తూ భోజనం చేశాడు.

ఆహారం స్వీకరించిన కాసేటికే ఒవెన్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ముందు అతని పెదవులు ఒంకర్లు పోవడం.. కడుపులో మంట.. ఆ తర్వాత ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ఒవెన్‌ మరణించాడు. ఈ సంఘటన 2017లో జరిగింది. నాటి నుంచి నేటి వరకు ఒవెన్‌ మృతికి గల ​కారణం మాత్రం తెలియలేదు. ఈ నేపథ్యంలో సౌత్‌వార్స్‌ కరోనర్స్‌ కోర్టు తాజాగా ఒవెన్‌ మృతికి గల కారణాల్ని వెల్లడించింది. తీవ్రమైన ఫుడ్‌ ఎలర్జీ వల్లే ఒవెన్‌ మరణించినట్లు కోర్టు ప్రకటించింది. పుట్టిన రోజునాడు ఒవెన్‌, బైరన్‌ చైన్‌ రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు డెయిరీ ఎలర్జీ ఉందని ఒవెన్‌ హోటల్‌ సిబ్బందికి తెలిపాడు. కానీ వారు ఆ విషయాన్ని మర్చిపోయి.. ఒవెన్‌ ఆర్డర్‌ చేసిన చికెన్‌ బ్రెస్ట్‌ పీస్‌ను వెన్నతో కలిపి ఉడికించారు.

సదరు పదార్థంలో వెన్న ఉందనే విషయాన్ని తెలిపారు కానీ.. దాన్ని చాలా సూక్ష్మంగా ముద్రించడంతో ఆ విషయం ఒవెన్‌ దృష్టికి రాలేదు. దాంతో అతడు ఆ ఆహారాన్ని స్వీకరించడం.. మరణించడం క్షణాల్లో జరిగిపోయాయి. ఒవెన్‌ మరణం అతడి కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చినప్పటికి.. ఓ కొత్త చట్టం రావడానికి మాత్రం దోహదపడింది. ఒవెన్‌ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఇక మీదట రెస్టారెంట్లలో ప్రతి ఆహారం మీద ఎలర్జీ లేబుల్స్‌ను ఉంచాలని ఆదేశించింది. ప్రతి వంటకం మీద.. దానిలో వాడిన పదార్థాల వివవరాలతో పాటు కలిగే ఎలర్జీల గురించి ఖచ్చితంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. రెస్టారెంట్లు తీసుకునే ఈ చిన్న చిన్న చర్యల వల్ల నిండు ప్రాణాన్ని కాపాడగల్గుతామని కోర్టు స్పష్టం చేసింది.

>
మరిన్ని వార్తలు