ఇది కాదు మనం చేయాల్సింది.. అందమైన ఫొటో!

15 Jun, 2020 20:55 IST|Sakshi

ఆడా.. మగా..? నలుపా.. తెలుపా..? ఆధిపత్య వర్గమా.. అణగదొక్కబడిన సమూహమా? ఈ తారతమ్యాలేవీ లేకుండా ‘మనిషి’గా జీవించినపుడే మానవత్వం అనే మాటకు అర్థం ఉంటుందని నిరూపించాడు పాట్రిక్‌ హచ్కిన్సన్‌ అనే వ్యక్తి. తమ నిరసనను వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగి గాయపడిన ‘ప్రత్యర్థి’ని కాపాడాడు. ‘ఇది కాదు మనం చేయాల్సింది’ అంటూ భుజాలపై మోసుకెళ్లి మరీ అతడిని రక్షించాడు. సెంట్రల్‌ లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జి వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

వివరాలు.. శ్వేతజాతి పోలీసు చేతిలో మే 25న అమెరికాలో హత్యకు గురైన ఆఫ్రో- అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లండన్‌లోని వాటర్లూ బ్రిడ్జి వద్ద ఈ జాత్యహంకార చర్యను వ్యతిరేకిస్తూ కొంతమంది శాంతియుత నిరసనకు దిగారు. ఇంతలో వీరికి వ్యతిరేకంగా శ్వేతజాతీయులు సైతం అక్కడే ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఓ శ్వేతజాతీయుడు కిందపడిపోయాడు. అతడి ముఖానికి గాయాలయ్యాయి. (ప్రత్యేక విమానం.. బోనస్‌.. గ్రేట్‌ సర్‌!)

ఈ విషయాన్ని గమనించిన పాట్రిక్‌.. అతడిని భుజాలపై వేసుకుని.. ఆస్పత్రికి తరలించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న రాయిటర్స్‌ ఫొటోగ్రాఫర్‌ డిలన్‌ మార్టినెజ్‌ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించారు. ఈ విషయం గురించి మార్టినెజ్‌ మాట్లాడుతూ.. ఈ ఫొటో తీయడం తన అదృష్టంగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన బ్రిటీష్‌ జర్నలిస్టు పీర్స్‌ మోర్గాన్‌.. ‘‘అన్ని వికారాల మధ్య.. మానవత్వాన్ని పరిమళింపజేసిన అందమైన క్షణం’’ అని ట్విటర్‌లో ఫొటో షేర్‌ చేశారు. కాగా పాట్రిక్‌ పర్సనల్‌ ట్రెయినర్‌గా పనిచేస్తున్నాడని.. బాధితుడి వివరాలు మాత్రం వెల్లడి కాలేదని రాయిటర్స్ పేర్కొంది. 

మరోవైపు.. ఈ ఘటన గురించి మాట్లాడేందుకు పాట్రిక్‌ అందుబాటులో లేకపోవడంతో అతడి స్నేహితుడు బ్రిటీష్‌ చానెల్‌ 4తో ఆదివారం మాట్లాడాడు. సదరు శ్వేతజాతీయుడిని కాపాడింది పాట్రికేనని ధ్రువీకరించినట్లు సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. యాంటీ రేసిస్ట్‌ నిరసనల్లో గత వారం మొత్తం 113 మంది అరెస్టయ్యారని, 23 మంది అధికారులు గాయపడినట్లు స్థానిక పోలీసులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. వాటర్లూ బ్రిడ్జి వద్ద ఘర్షణలు చోటుచేసుకున్న సమయంలో అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టినట్లు తెలిపారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు