మెక్సికోలో బాణసంచా పేలుడు

22 Dec, 2016 02:51 IST|Sakshi
మెక్సికోలో బాణసంచా పేలుడు

31 మంది మృతి..
72 మందికి గాయాలు


టుల్టెపెక్‌(మెక్సికో): క్రిస్మస్, నూతన సంవత్సర సంబరాల కోసం సన్నద్ధమవుతున్న మెక్సికోలో పెను విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఇక్కడి అతిపెద్ద బాణసంచా మార్కెట్‌లో భారీ పేలుళ్లు సంభవించడంతో 31 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. రానున్న క్రిస్మస్‌ నేపథ్యంలో మెక్సికో సిటీ శివారు ప్రాంతమైన టుల్టెపెక్‌లోని బాణసంచా మార్కెట్‌కు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అయితే స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.50 నుంచి ఒక్కసారిగా పేలుళ్లు మొదలయ్యాయి. దీంతో మార్కెట్లోని 300 బాణాసంచా దుకాణాలతో పాటు సమీపంలోని ఇళ్లు, వాహనాలు, ఇతరత్రా ఆస్తులు కాలి బూడిదయ్యాయి.

అక్కడి మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది మూడు గంటలకుపైగా శ్రమించారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 26 మంది మృతి చెందగా, మరో ఐదుగురు ఆస్పత్రిలో చనిపోయారని అధికారులు తెలిపారు. దాదాపు 72 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. శరీరాలు పూర్తిగా కాలిపోవడంతో చనిపోయిన వారిని గుర్తించడం కష్టంగా ఉందని, ఫోరెన్సిక్‌ నిపుణుల సహాయంతో మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని మెక్సికో గవర్నర్‌ ఎరువియల్‌ అవిలా చెప్పారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు.