ఇండోనేసియాపై ఐఎస్ పంజా

15 Jan, 2016 02:01 IST|Sakshi
ఇండోనేసియాపై ఐఎస్ పంజా

అధ్యక్ష భవనానికి సమీపంలో విచక్షణారహితంగా కాల్పులు, పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు
     ఆధునిక ఆయుధాలు, గ్రెనేడ్లతో విధ్వంసం
     ఐదుగురు ఉగ్రవాదులు సహా ఏడుగురు మృతి, 20 మందికి గాయాలు


 జకార్తా: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో పారిస్ తరహా దాడులకు తెగబడ్డారు. జకార్తా నడిబొడ్డున అధ్యక్ష భవనానికి దగ్గర్లో, అమెరికా, ఫ్రాన్స్ సహా పలు దేశాల రాయబార కార్యాలయాలు, ఐరాస సంస్థలు, షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతానికి గురువారం ఉదయం అత్యాధునిక ఆయుధాలు, గ్రెనేడ్లతో మోటార్ సైకిళ్లపై వచ్చిన ఐదుగురు ఉగ్రవాదులు బాంబు పేలుళ్లు, కాల్పులకు పాల్పడ్డారు. అక్కడే ఉన్న స్టార్‌బక్స్ కేఫేలోకి చొచ్చుకువెళ్లారు. గ్రెనేడ్ దాడులతో ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించారు.  కేఫెలో ఒక కెనడియన్‌ను, అల్జీరియన్‌ను బందీలుగా పట్టుకున్నారు. వారిలో అల్జీరియన్ గాయాలతో తప్పించుకోగా, కెనడియన్‌ను కాల్చి చంపారు.

బందీలను తప్పించేందుకు ప్రయత్నించిన ఒక ఇండోనేసియా దేశస్తుడిని కూడా చంపేశారు. ఇద్దరు ఉగ్రవాదులు అక్కడే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఒక ఉగ్రవాది కెఫేలో నుంచి బయటకు వచ్చి అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అనంతరం అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న భద్రతాదళాల చేతిలో హతమయ్యాడు. ఉగ్రదాడితో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమయింది. రోడ్లు మృతులు, క్షతగాత్రుల దేహాలతో భీతావహంగా మారాయి. అదేసమయంలో మోటారుసైకిల్‌పై వచ్చిన మరో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికి దగ్గర్లో ఉన్న పోలీస్ ఔట్ పోస్ట్‌లోనికి దూసుకెళ్లి తమను తాము పేల్చేసుకున్నారు. ఆ ఆత్మాహుతి దాడిలో నలుగురు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంమీద ఈ దాడిలో ఐదుగురు ఉగ్రవాదులు సహా ఏడుగురు చనిపోగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులందరూ హతమయ్యారని జకార్తా పోలీసులు ప్రకటించారు. జకార్తాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. అమెరికాను ఉద్దేశిస్తూ.. మతయుద్ధం చేస్తున్న సంకీర్ణ దేశాల పౌరుల సముదాయం లక్ష్యంగా తమ కాలిఫేట్ సైనికులు ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొంది.

ముస్లిం మెజారిటీ దేశమైనఇండోనేసియాలో బలంగా ఉన్న ఐఎస్ అనుబంధ సంస్థ ‘ఐఎస్‌ఐఎస్ నెట్‌వర్క్’ టైస్టులు ఈ దాడికి పాల్పడి ఉండొచ్చని ఇండోనేసియా పోలీస్ విభాగ అధికార ప్రతినిధి ఆంటన్ చార్లియన్ పేర్కొన్నారు. ఈ తరహా సమన్వయంతో దాడులు చేయగల సామర్ధ్యం ఐఎస్‌కే ఉందన్నారు. ఉగ్రవాదులెవరూ ఆత్మాహుతి దాడికి పాల్పడలేదని, పోలీసుల ప్రతికాల్పులలోనే హతమయ్యారని చార్లియన్ చెప్పారు. దాడి నేపథ్యంలో జకార్తా సహా దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. ఈ తరహా ఉగ్ర దాడులకు భయపడబోమని ఇండోనేసియా అధ్యక్షుడు జాకొ జొకోవి విడొడో స్పష్టం చేశారు. ప్రజలంతా సంయమనంతో, ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇండోనేసియాలో ఉగ్రదాడిని భారత ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. ఐఎస్ తన వినాశనాన్ని తానే ఆహ్వానిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు.

 రహస్య సంకేతం
 ఈ దాడుల గురించి నవంబర్‌లోనే ఉగ్రవాదులు ఒక రహస్య సంకేత భాషలో హెచ్చరికలు జారీ చేశారని చార్లియన్ వెల్లడించారు. ‘త్వరలో ఇండోనేసియాలో ఒక సంగీత కార్యక్రమం జరగబోతోంది. అది అంతర్జాతీయ వార్తగా మారుతుంది’ అన్న సందేశాన్ని పంపించారన్నారు. 2000- 2009 మధ్య ఇండోనేసియా పలు ఉగ్రదాడుల బాధిత దేశంగా నిలిచింది. 2002లో బాలిలో జరిగిన దాడిలో 202 మంది చనిపోయారు. అయితే, 2009 తరువాత దేశంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌లపై భద్రతాదళాలు ఉక్కుపాదం మోపడంతో ఉగ్రదాడులు తాత్కాలికంగా ఆగాయి. ఇండోనేసియాను తమ కీలక స్థావరంగా చేసుకునేందుకు ఐఎస్ చాన్నాళ్లుగా ప్రయత్నిస్తోంది.

 

మరిన్ని వార్తలు