ఇక అంతరిక్షంలోనూ షికార్లు చేయొచ్చు!

4 Apr, 2017 01:57 IST|Sakshi
ఇక అంతరిక్షంలోనూ షికార్లు చేయొచ్చు!

అంతరిక్షంలో షికారు కొట్టే రోజులు దగ్గరకొచ్చేస్తున్నాయి. అందుకు తార్కాణం ఈ ఫొటోలే. ఏంటివి? అంటున్నారా? మీకు అమెజాన్‌ కంపెనీ గురించి తెలుసు కదా.. దాని ఓనర్‌ జెఫ్‌ బెజోస్‌. ఈయన గారికి బ్లూ ఆరిజన్‌ అనే ఇంకో కంపెనీ కూడా ఉంది. త్వరలోనే ఈ కంపెనీ ద్వారా అంతరిక్షానికి కొందరు టూరిస్టులను తీసుకెళ్లనున్నారు. అలా తీసుకెళ్లే అంతరిక్ష నౌక ఫొటోలే పక్కనున్నవి. పేరు న్యూషెపర్డ్‌. కొలరాడో స్ప్రింగ్స్‌ (అమెరికా)లో సోమవారం నుంచి మొదలుకానున్న 33వ స్పేస్‌ సింపోజియంలో దీని ప్రదర్శించనున్నారు. అన్నీ సవ్యంగా సాగితే దీంట్లో వచ్చే ఏడాదే కొంతమందిని భూమికి వంద కిలోమీటర్ల ఎత్తువరకూ తీసుకెళ్లనుంది.

భూ వాతావరణానికి, అంతరిక్షానికి సరిహద్దులాంటి ఈ ప్రాంతాన్ని కార్మన్‌ లైన్‌ అంటారు. న్యూషెపర్డ్‌ ద్వారా ఇక్కడికి చేరుకున్న పర్యాటకులు అక్కడే కొన్ని నిమిషాలపాటు భార రహిత స్థితిని అనుభవిస్తారు. విశాలమైన కిటికీల గుండా అంతరిక్షం అందాలను ఎంచక్కా గమనించవచ్చు. ఆ తరువాత ఈ క్యాప్సూల్‌ నుంచి బూస్టర్‌ రాకెట్‌ కూడా విడిపోతుంది. ఆ వెంటనే కొన్ని నిమిషాలపాటు ఇది నేలకేసి ఫ్రీగా పడిపోతూ వస్తుంది. ఆ తరువాత పారాచూట్ల సాయంతో ల్యాండ్‌ అవుతుంది. మరోవైపు బూస్టర్‌  రాకెట్‌ కూడా తనంతట తాను విడిగా నేలకొచ్చి దిగుతుంది.



న్యూషెపర్డ్‌లో మొత్తం ఆరుగురు కూర్చోగలిగితే.. అందరికీ ఓ కిటికీ ఉంటుంది. ఈ అంతరిక్ష నౌకను ఇప్పటికే ఐదుసార్లు విజయవంతంగా పరీక్షించి చూశారు. స్పేస్‌ ఎక్స్‌ సంస్థ సిద్ధం చేసిన క్రూడ్రాగన్‌ క్యాప్సూల్‌ కంటే న్యూషెపర్డ్‌ కొంచెం భిన్నంగా ఉంటుంది. డ్రాగన్‌లో కేవలం ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుంది. వ్యోమగాములను అంతరిక్ష కేంద్రానికి మోసుకెళ్లేందుకు మాత్రమే ఉద్దేశించినది కాబట్టి దీంట్లోని కిటికీలూ చిన్న సైజువి ఉన్నాయి. ఇంకో విషయం.. క్రూడ్రాగన్‌ కూడా వచ్చే ఏడాదే పనిచేయడం మొదలవుతుంది. మొత్తానికి ఇంకో అంతరిక్ష పోటీకి రంగం సిద్ధమైందన్నమాట!                                                                                          - సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు