అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!

24 Jun, 2015 16:18 IST|Sakshi
అమెరికా అధ్యక్ష పోటీలో మనోడు!

వాషింగ్టన్: ప్రపంచానికి పెద్దన్నగా చెలామణీ అవుతోన్న అమెరికా దేశానికి అధ్యక్షుడిగా భారత సంతతికి చెందిన వ్యక్తి పోటీ పడతారో లేదో మరి కొద్ది గంటల్లో తేతిపోనుంది. 2016లో జరగనున్న ఎన్నికల రేసు మొదలైన దగ్గర్నుంచి.. 'అతడే గెలుపు గుర్రం' అని అందరిచేతా అనిపించుకున్న లూసీయానా గవర్నర్ బాబీ జిందాల్ మరి కొద్దసేపట్లో తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు.

రిపబ్లికన్ పార్టీ తరఫున బాబీతోపాటు పదకొండు మంది ప్రముఖులు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. వారిలో మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ సోదరుడు, ఫ్లోరిడా మాజీ గవర్నర్ జెబ్ బుష్, న్యూరో సర్జన్ బెన్ కార్సన్, టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రూజ్, హెచ్పీ (హ్యులెట్ ప్యాకర్డ్) సంస్థ మాజీ సీఈవో కార్లీ ఫియోరీనా,  2008లో అధ్యక్ష స్థానంకోసం పోటీచేసి ఓడిపోయిన మైక్ హుక్కాబీ తదితరులు ఉన్నారు.

అయితే అపారమైన పాలనా అనుభవంతోపాటు సమర్థుడైన నాయకుడిగా పేరుతెచ్చుకున్న బాబీ జిందాల్ రేసులో అందరికంటే ముందున్నారు. పైగా ప్రస్తుతం అత్యంత ప్రధానమైన రిపబ్లికన్ గవర్నర్ల అసోసియేషన్కు ఆయన చైర్మన్గా కొనసాగుతున్నారు. అంతేకాదు విధాన పరమైన అంశాల్లో ప్రత్యర్థి డెమోక్రాట్ పార్టీని చీల్చి చెండాడటంలో రిపబ్లికన్ల తరఫున బాబీని మించిన వ్యక్తి ఎవరూ లేరు. ఇప్పటికే ఆయనకు 'వోకల్ క్రిటిక్ ఆఫ్ ఒబామా' అనే పేరుంది. డెమోక్రాట్ల తరఫున అధ్యక్ష పదవికి రేసులో ఉన్న హిల్లరీ క్లింటన్ను  ఇప్పటికే తన విమర్శనాస్త్రాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు బాబీ జిందాల్.

మరిన్ని వార్తలు